Header Ads Widget

తొలి ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ మోజైక్‌ఇంటర్నెట్‌.... ఇంటర్నెట్‌.... ఇంటర్నెట్‌.... ఈరోజు ఈ పదం వినపడని క్షణం వుండదంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌ వాడకం అంతగా పెరిగిపోయింది. బ్యాంక్‌ ఖాతాలు, బిల్లులు, రిజర్వేషన్లు ఇలా చెప్పుకొంటూపోతే లెక్కకు మిక్కిలి పనులన్నీ ఈరోజు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. మరి వీటి వాడకానికి వెనుక వున్న కథను కూడా తెలుసుకుందాం. ఇంటర్నెట్‌ వాడాలంటే దానికి కూడా ఒక ఒక అప్లికేషన్‌ కావాలి గదా! ఈరోజు అన్నీ పనులను కాలు కదపకుండా చక్కాచక్కా చేసుకుపోతున్నామంటే వీటిని ఆపరేట్‌ చేయడానికి బ్రౌజర్లను కనుగొన్న వారికి నిజంగానే ధన్యవాదాలు చెప్పాలి. గతంలో కంప్యూటర్‌ గురించి, ఇంటర్నెట్‌ గురించి బాగా అవగాహన వున్నవారు మినహా సామాన్యులు దీన్ని వినియోగించుకోలేకపోయేవారు. అంటువంటి రోజుల నుండి ఈరోజు చిన్న పిల్లలు కూడా ఆపరేట్‌ చేయగల స్థాయికి వచ్చింది.
తొలినాళ్లలో ఇంటర్నెట్‌ను శాస్త్రవేత్తలు, ప్రోజెక్ట్‌లు చేస్తున్న విద్యార్థులు మాత్రమే ఉపయోగించేవారు. వీరు దీని ద్వారా ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడం, ఇమేజ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొనేవారు. 1990లలో ఇంటర్నెట్‌ని వినియోగించుకోవాలంటే చాలా శ్రమపడాల్సి వచ్చేది. ఎఫ్‌టిపి, గోపెయిర్‌, టెల్‌నెట్‌ వంటి ఇంటర్నెట్‌ ప్రోటోకాల్స్‌ను వాటిని నేర్చుకోవలసి వచ్చేది. వీటికి తోడు అప్పట్లో ఎక్కువగా యునెక్స్‌ ఆధారిత సర్వర్లు వుండడం వలన అనేక కష్టమైన కమాండ్లను గుర్తుంచుకోవలసి వచ్చేది. దీంతో సామాన్యులు ఆపరేట్‌ చేయగలిగేవారుకాదు. ఇంటర్నెట్‌ యాక్సెస్‌ సులభతరం చేయాలంటే ఎఫ్‌టిపి, యూజ్‌నెట్‌, టెలినెట్‌, గోపెయిర్‌ లాంటి వివిధ ప్రోటోకాల్స్‌ మరియు ఇంటర్నెట్‌ సంబంధిత అప్లికేషన్లలోని అంశాలను క్రోడీకరించి ఒకే అప్లికేషన్‌గా అందించాలి. అటువంటి పనికి అమెరికాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ అప్లికేషన్స్‌ (ఎన్‌సిఎస్‌ఎ) ఉద్యోగులైన మార్క్‌ అండ్రీసిన్‌, ఎరిక్‌ బీనా లాంటి వారు 1992 డిసెంబర్‌ ప్రాంతంలో ప్రోగ్రామ్‌ని వ్రాయడం మొదలు పెట్టి ఆరు వారాలు కష్టపడి 9000 లైన్ల ప్రోగ్రామ్‌ వ్రాసి దానికి మోజైక్‌ అని పేరు పెట్టారు. దానిని ఎన్‌సిఎస్‌ఎ వారు 1993 జనవరిలో అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
మోజైక్‌ విడుదలతో ఇంటర్నెట్‌ యాక్సెస్‌లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (జియుఐ)తో రూపొందించబడిన ఈ ప్రోగ్రామ్‌ ద్వారా మౌస్‌ని వినియోగించి పాయింట్‌ - అండ్‌ - క్లిక్‌ అనే పద్ధతితో కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ మీద పెద్దగా అవగాహన లేనివారు సైతం ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేయడం ఎంతో సులభతరమైంది. మోజైక్‌ విండోలని ఫార్వర్డ్‌, బ్యాక్‌ బటన్స్‌ ద్వారా ఇంటర్నెట్‌లో ఒక పేజీ నుండి మరో పేజీకి ముందుకు, వెనుకకు వెళ్లడం, అనేక కొత్త అంశాలు దీనిలో రూపొందించడటంతో మోజైక్‌ తొలి ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ అప్లికేషన్‌గా ఆవిర్భవించింది.

హెచ్‌టిఎంఎల్‌ లాంగ్వేజ్‌ సహాయంతో ఇంటర్నెట్‌లో సమాచారాన్ని ఉంచడం సులభమైంది. హెచ్‌టిఎంఎల్‌ లాంగ్వేజ్‌ ఇంటర్నెట్‌లో ఒక ప్రామాణికమైంది. హెచ్‌టిఎంఎల్‌ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్‌లో హైపర్‌లింక్‌లు, ఇమేజ్‌లు, సెంటర్‌ ట్యాగ్స్‌ వంటి కొత్త అంశాలు జోడించబడ్డాయి. అంతకు ముందు టెక్ట్స్‌, గ్రాఫిక్స్‌ను ఒకే విండోలో చూడటం సాధ్యమైయ్యేదికాదు. మోజైక్‌ వచ్చిన తరువాత ఏకకాలంలో వాటిని చూడడం సాధ్యమైంది. దీనితో ఇంటర్నెట్‌ మల్టీ మీడియా సామర్థ్యాన్ని సంతరించుకుంది.
1993 మార్చిలో ఎన్‌సిఎస్‌ఎ వారు మోజైక్‌ని ఇంటర్నెట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుకునే సౌకర్యం కల్పించారు. దీనితో వేలాది మంది దీనిని డౌన్‌లోడ్‌ చేసుకొని వాడటంతో మోజైక్‌ క్లిక్‌ అయింది. దీనితో ఆనాటి నుండి కంప్యూటర్‌ శాస్త్రవేత్తలకు ఇంటర్నెట్‌లో సమాచారాన్ని సృజనాత్మకంగా వుంచడానికి కృషి ప్రారంభించారు.

Post a Comment

1 Comments

  1. మంచి సమాచారం.
    కృతజ్ఞతలు

    ReplyDelete