Ad Code

చైనాలో పెరుగుతున్న అశ్లీల వెబ్‌సైట్ల

చైనాలో పెరుగుతున్న అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయటానికి 'వర్చువల్‌ పోలీస్‌' విధానాన్ని ప్రారంభించినట్లు చైనా ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.
వర్చువల్‌ పోలీస్‌ అంటే...?
చైనాలో యాక్సెస్‌ అయ్యే ఇంటర్నెట్‌కి సంబంధించిన సమస్త సమాచారాన్ని నియంత్రించటానికి, చైనా ప్రభుత్వం ప్రత్యేకమైన నియంత్రణా వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇది పూర్తిగా దేశంలో యాక్సెస్‌ అయ్యే ఇంటర్నెట్‌ వినియోగదార్లు ఏయే సైట్లు చూస్తున్నారు? ప్రభుత్వం నిషేధించిన సంస్థలు, ఇతర సైట్సును ఓపెన్‌చేసి చూస్తున్నారా? లేక ఏదైన తప్పుడు సమాచారాన్ని పంపుతున్నారా? అనే వాటిని తెల్సుకోవటానికి ప్రత్యేకమైన పోగ్రామ్‌ను ఏర్పాటుచేశారు. దీనికి గుర్తుగా రెండు యానిమేషన్‌ పోలీసు బమ్మలను ఏర్పాటు చేశారు. తద్వారా ప్రతి ఒక్కరూ ఏమి చూస్తున్నారో తమకు తెలుస్తుందని హెచ్చరికను పంపటమైంది.
వర్చువల్‌ పోలీస్‌ విధానం గురించి చైనా మీడియా అనేక ఆసక్తికర విషయాలను తెలిపింది. దీని ప్రకారం ఇద్దరు వర్చువల్‌ పోలీస్‌ అధికారులు (ఒకరు మగ, మరొకరు మహిళ) ప్రతి అరగంటకు ఒకసారి ఇంటర్నెట్‌ యూజర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమై ఇంటర్నెట్‌ సెక్యూరిటీ గురించి గుర్తుచేస్తారు. వారు అశ్లీల వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేయటానికి ప్రయత్నిస్తే హెచ్చరికలు యూజర్‌ స్క్రీన్‌పై వస్తాయి. తద్వారా ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్స్‌ను యూజర్‌ ఓపెన్‌ చేయలేడు. అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఓపెన్‌ చేయటానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను సెంట్రల్‌సర్వర్‌లో నమోదు అవుతాయి. అంతేగాక ఇంటర్నెట్‌లోని వెబ్‌సైట్స్‌, పోర్టల్స్‌, ఆన్‌లైన్‌ ఫోరమ్స్‌ అన్నింటినీ ఇద్దరు వర్చువల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ పర్యవేక్షిస్తారని బీజింగ్‌ నుంచి ప్రచురితమయ్యే చైనా డైలీ వెల్లడించింది. అంతేగాక దీనివల్ల అశ్లీలతను వ్యాప్తి చేసే వెబ్‌సైట్లపై పూర్తిస్థాయి నియంత్రణ వస్తుందని బీజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో పేర్కొంది. అయితే, ఇద్దరు అధికారులు చట్టాల ప్రకారం వెబ్‌సైట్స్‌ను పర్యవేక్షిస్తారా, లేదా అన్నది చెప్పకపోయినా, పాప్‌అప్‌ ఐకాన్స్‌ను క్లిక్‌ చేయటం ద్వారా ఇంటర్నెట్‌ సర్వెలెన్స్‌ సెంటర్‌లో వివరాలు నమోదవుతాయని తెలిపారు. అనారోగ్యకరమైన వాతావరణం ఇంటర్నెట్‌ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తోందని, పార్టీ నియమావళికి అనుగుణంగా నెట్‌ను వినియోగించాలని గత ఏప్రిల్‌లోనే చైనా అధ్యక్షుడు హూ జింటావో దేశప్రజలకు పిలుపు ఇచ్చారు. నెట్‌ను పార్టీ నిర్మాణానికి ప్లాట్‌ఫామ్‌గా ఏర్పరచుకోవాలని పిలుపు ఇవ్వటమేగాక, నెట్‌లోవున్న అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలన్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే 1,28,000వేల వెబ్‌సైట్లను గుర్తించటం జరిగిందని, వాటిలో 244వెబ్‌సైట్లను ఇప్పటికే మూసివేశారని బీజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.
అమెరికా తర్వాత ప్రపంచంలో 120మిలియన్ల ఇంటర్నెట్‌ వినియోగదారులున్న రెండో దేశంగా చైనా అవతరించింది. ఇదే సమయంలో అక్కడ ఇంటర్నెట్‌ వినియోగం పెడదోవ పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం పదేళ్ళ క్రిందటే ఇంటర్నెట్‌ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు పదివేల మంది అధికార్లను నియమించింది. అంతేగాక దుర్వినియోగం చేసినవారి పట్ల కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu