ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ : ఎస్‌బిఐ


కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నప్పటికీ వచ్చే ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా)  తాజా హెచ్చరించింది. సెప్టెంబర్‌లో కరోనా కేసుల నమోదు పతాక స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. కొవిడ్ 19 ద రేస్ టు ఫినిషింగ్ లైన్ అన్న పేరుతో ఎస్‌బిఐ తన పరిశోధనాత్మక నివేదికను విడుదల చేసింది. దేశంలో సెకండ్ వేవ్ పీక్ మే 7న నమోదైందని, ప్రస్తుత డేటా ప్రకారం జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చని, ఆగస్టు 15 తరువాత కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగవచ్చని నివేదికలో అంచనా వేసింది. దేశంలో కరోనా వైరస్ ఉధ్ధృతి బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలపై భారతీయ స్టేట్ బ్యాంక్ నిపుణులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే జులై రెండో వారానికి రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు తగ్గుతుందని నివేదిక పేర్కొంది. గ్లోబల్ డేటా అంచనాల ప్రకారం సెకండ్ వేవ్‌తో పోలిస్తే కరోనా థర్డ్ వేవ్ సగటు ఉధృత కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. గత చారిత్ర పోకడల ఆధారంగా ఆగస్టు 12 తరువాత కేసుల సంఖ్య క్రమంగా పుంజుకుని నెల తరువాత పీక్‌స్టేజికి వెళ్లే అవకాశం ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగానే కొనసాగుతోంది. నిత్యం సరాసరి 40 లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు దేశ జనాభాలో 4.6 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇక తొలి డోసు తీసుకున్న వారు 20.8 శాతం మాత్రమే. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్‌తోసహా ఇతర దేశాల కంటే ఇది ఇప్పటికీ తక్కువే అని నివేదిక అభిప్రాయపడింది.

Post a Comment

0 Comments