Ad Code

మార్కెట్లోకి ఆడీ ఈ-ట్రాన్‌ ఎలక్ట్రిక్‌ కార్లు

 

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ భారత మార్కెట్లో తొలిసారి ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేసింది. ఈ-ట్రాన్‌ పేరిట మూడు ఎస్‌యూవీలను గురువారం విడుదల చేసింది. ఇందులో ఈ-ట్రాన్‌ 50 ధరను ₹99.99 లక్షలుగా నిర్ణయించగా.. ఈ-ట్రాన్‌ 55, ఈ-ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌ 55 ధరను ₹1.16 కోట్లు, ₹ 1.18 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్‌ ధరలు) నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో తాము ఒకటి కాదు.. మూడు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఒకేసారి తీసుకొచ్చామని విడుదల సందర్భంగా ఆడీ ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. వీటి విడుదలతో భారత్‌లో తమ విద్యుత్‌ వాహనాల ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. ఆఫ్టర్‌ సేల్స్‌, ఛార్జింగ్‌, ఓనర్‌షిప్‌తో పాటు పలు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. మూడేళ్ల బైబ్యాక్‌ ఆఫర్‌ కూడా ఇస్తున్నామని చెప్పారు. త్వరలో మరిన్ని విద్యుత్‌ వాహనాలు తీసుకొస్తామని వెల్లడించారు.

ఈ-ట్రాన్‌ 55, ఈ-ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌ 55 కార్లలో డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మోటర్లు వినియోగించారు. ఇవి 300kW పవర్‌ను, 664 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కార్లు కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని కంపెనీ తెలిపింది. 95kWh లిథియం ఐయాన్‌ బ్యాటరీ కలిగిన ఈ ఎస్‌యూవీలు ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 359-484 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ-ట్రాన్‌ 50లో డ్యూయల్‌ మోటార్‌ ఉంది. 71kWh లిథియం అయాన్‌ బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌తో 264-379 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వీటిలో రెండువైపులా ఛార్జింగ్‌ పోర్ట్స్‌ ఉంటాయి. స్టాండర్డ్‌ వారెంటీ 2 ఏళ్లతో పాటు హై వోల్జేజ్‌ బ్యాటరీ వారెంటీ 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు (ఏది ముందైతే అది) అందిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, ఐదేళ్ల పాటు రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ ఇస్తున్నట్లు ఆడీ తెలిపింది. 

Post a Comment

0 Comments

Close Menu