Header Ads Widget

ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను: సుందర్‌ పిచాయ్‌

 

బీబీసీ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన గూగుల్‌ సీఈఓ

కరోనా మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కోవిడ్‌ కు అంతమెన్నడో తెలియడం లేదు.. రెండు వేవ్‌లతో సతమతమైన జనాలపై మూడో వేవ్‌ విరుచుకుపడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఓ విధంగా కోవిడ్‌ వల్ల ఇబ్బంది పడ్డారంటే అతిశయోక్తి కాదు. కుబేరులు, పేదలు, ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధ పెట్టింది కోవిడ్‌. ఈ జాబితాలో తాను కూడా ఉన్నాను అంటున్నారు గూగుల్‌, అ‍ల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌. మహమ్మారి తనను కూడా మానసికంగా బాధించిందన్నారు. బీబీసీకిచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన 'ఫ్రీ అండ్‌ ఓపెన్‌ ఇంటర్నెట్‌'పై దాడితో సహా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు.

ఇంటర్వ్యూ సందర్భంగా చివరిసారిగా ఎప్పుడు ఏడ్చారన్న ప్రశ్నకు సుందర్‌ పిచాయ్‌ బదులిస్తూ... ''కోవిడ్‌ వేళ ప్రపంచవ్యాప్తంగా నిలిపి ఉంచిన మోర్గ్‌ ట్రక్కులను చూసినప్పుడు.. రెండు నెలల క్రితం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నాను'' అన్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో భాగంగా ఏప్రిల్‌-మే నెలల్లో భారత దేశంలో వేలాది మంది మరణించారు. గంగా నదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ పరిస్థితులు తనను ఎంతో బాధించాయన్నారు పిచాయ్‌.

అంతేకాక ''నేను అమెరికన్‌ పౌరుడిని. కానీ నాలో భారతీయత ఎంతో లోతుగా పాతుకుపోయింది. నేను ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ భారతీయత నాలో అతి పెద్ద భాగంగా నిలుస్తుంది. నేను దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. సాంకేతికతలో చోటు చేసుకుంటున్న మార్పులు నాపై ఎంతో ప్రభావం చూపేవి. నా బాల్యంలో చూసిన రోటరి ఫోన్‌.. పాత స్కూటర్‌ ఇవన్ని నన్ను చాలా ఆశ్చర్యపరిచేవి'' అని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

''నా తండ్రి ఏడాది మొత్తం జీతం ఖర్చు చేస్తే నేను అమెరికా చేరుకోగలిగాను. కాలీఫోర్నియాలో దిగినప్పుడు నేను ఊహించుకున్న దానికి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా గమనించాను. అమెరికా చాలా ఖరీదైనది. ఇక్కడ ఓ బ్యాక్‌పాక్‌ కొనాలంటే దాని విలువ మా నాన్న నెల జీతంతో సమానంగా ఉంటుంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కేవలం అదృష్టం మాత్రమే కారణం కాదు. సాంకేతికత మీద నాకున్న అభిమానం కూడా నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది'' అని తెలిపారు సుందర్‌ పిచాయ్‌. 

Post a Comment

0 Comments