నాసా : సత్తా చాటిన తెలుగు విద్యార్థులు


చంద్రుడిపై మానవ మనుగడ కోసం నాసా పరిశోధనలు చేపడుతోంది. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌'లో ఇద్దరు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో విశాఖకు చెందిన కరణం సాయి ఆశీష్‌కుమార్, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరు అమరేశ్వరప్రసాద్, యూఎస్‌కు చెందిన ప్రణవ్‌ ప్రసాద్‌లు 'ఏఏ స్టార్‌' పేరుతో రూపొందించిన ప్రాజెక్టుకు టాప్‌ టెన్‌లో చోటు దక్కింది. దీంతో వీరికి రూ.25 వేల డాలర్లు (రూ.18 లక్షలు) లభించాయి. ఫేజ్‌-2లో నాసాతో కలిసి రెండు సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. చంద్రుడిపై నిర్మాణాలు, నీటి జాడల అన్వేషణ కోసం నాసా గత కొన్నేళ్లుగా పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మంచు (ఐస్‌) ఉన్నట్లు గుర్తించింది నాసా. దాన్ని మైనింగ్‌ ద్వారా తవ్వి తీసేందుకు గల అవకాశాలపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సమర్పించాలని  ప్రకటించింది. బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌ పేరుతో నిర్వహించిన దీనికి 48 దేశాల నుంచి అనేక యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల నుంచి 374 ప్రాజెక్టులు వచ్చాయి. ఏయూ నుంచి ఎంటెక్‌ పూర్తి చేసిన ఆశీష్‌కుమార్, అమరేశ్వరప్రసాద్‌లతోపాటు యూఎస్‌ నుంచి ప్రణవ్‌ప్రసాద్‌ బృందం రూపొందించిన ప్రాజెక్టు టాప్‌ టెన్‌లో నిలిచి అవార్డు పొందింది. వీరి ప్రాజెక్టులో చోటు దక్కడంతో హర్షం వ్యక్తం అవుతోంది.

Post a Comment

0 Comments