సముద్ర జలాల్లో ముంబై ?

 


మహారాష్ట్ర రాష్ట్ర సచివాలయం మంత్రాలయ, ముంబైలోని బిజినెస్ డిస్ట్రిక్ట్ నారిమన్ పాయింట్ 2050 కల్లా పూర్తిగా నీట మునుగుతుందని బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ హెచ్చరించారు. భూతాపం పెరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్ర పర్యాటక, పర్యావరణశాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలిసి శనివారం ఇక్బాల్ సింగ్ చాహల్ ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి హెచ్చరికలు జారీ చేస్తుందని, కానీ ప్రజలు మేల్కొనకపోతే పరిస్థితి దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబై నగరంలో సుమారు 70 శాతం.. సౌత్ ముంబైలోని ఏ,బీ,సీ, డీ వార్డులు జలమయం అవుతాయని ఇక్బాల్ సింగ్ చాహల్ పేర్కొన్నారు. కుఫే పరేడ్‌, నారిమన్ పాయింట్, మంత్రాలయ ప్రాంతాల్లో 80% నీట మునిగిపోతుందన్నారు. ఈ ప్రాంతాలు కనుమరుగు కావడం ఖాయం అని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్ తరాలతోపాటు ప్రస్తుత తరం కూడా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇంతకుముందు పర్వత శ్రేణులు కరగడం వల్ల భూతాపం కలుగుతుందని, మనపై నేరుగా ప్రభావం ఉండదని భావించామన్నారు. 129 ఏండ్లలో తొలిసారి గతేడాది వచ్చిన నిసర్గ తుఫాన్ ముంబైని ముంచెత్తిందని ఇక్బాల్ సింగ్ చాహల్ గుర్తు చేశారు. గతేడాది ఆగస్టు ఐదో తేదీన నారిమన్ పాయింట్ వద్ద ఐదు నుంచి 5.5 అడుగుల నీరు నిలిచిందని పేర్కొన్నారు. దక్షిణాసియాలో క్లైమేట్ చేంజ్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన తొలి నగరం ముంబై అని చెప్పారు.

Post a Comment

0 Comments