Ad Code

అంగారకుడిపై జీవాన్వేషణ


జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్‌సివరెన్స్‌ రోవర్‌ శోధన కొనసాగుతుంది. మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్‌ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్‌లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్లుగానే గుంత చేసిన రోవర్‌.. రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఇలా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనుకున్నట్లుగానే అన్ని పరికరాలు సక్రమంగా పనిచేశాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. రెండో ప్రయత్నానికి నాసా సిద్ధమైంది. ఈసారైనా రాతి నమూనాలను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పర్‌సివరెన్స్‌ రోవర్‌ తన రెండో ప్రయత్నంలో కొత్త లొకేషన్ సిటాడెల్ కు వెళ్లనుంది. అక్కడ రాతి నమూనాలను సేకరించనుంది. ఈసారి, రాతి నమూనా సేకరించబడింది అని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. రోవర్ బెల్లీలో నమూనా చేరగానే దానికి సంబంధించిన చిత్రాలు ఇంజినీర్లకు చేరతాయని నిపుణులు తెలిపారు. నాసా చేసిన తొలి ప్రయత్నంలో నమూనాలు మాత్రం నిర్దేశిత టైటానియం గొట్టాల్లోకి రాలేదని పరిశోధకులు తెలిపారు. దీనికి పరికరాల పనితీరులో లోపం కారణం కాకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ పురాతన రాయి తాము అనుకున్నట్లుగా స్పందించి ఉండకపోవడమే కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై రానున్న కొన్ని రోజుల పాటు విశ్లేషణ జరుగుతుందన్నారు.

గతంలోనూ ఇలాంటి సందర్భం ఎదురైందని గుర్తుచేశారు. 2008 ఫీనిక్స్ మిషన్‌లోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలిపారు. అప్పుడు మట్టి నమూనాలు సేకరించినప్పటికీ.. అవి జిగురుగా ఉండడంతో అనుకున్నట్లుగా వాటిని పరీక్షించేందుకు ఆయా పరికరాలపైకి కదిలించలేక పోయామన్నారు. కానీ, అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు విజయం సాధించామన్నారు. ఈసారి కూడా తదుపరి ప్రయత్నాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మిషన్‌లో భాగంగా పంపిన ఇంజెన్యుటీ హెలికాప్టర్‌ సైతం తన విధుల్ని సక్రమంగా పూర్తి చేస్తున్నట్లు నాసా తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్ని జల్లెడ పట్టిన ఈ హెలికాప్టర్‌ అనేక చిత్రాలను నాసాకు పంపింది. వీటిని పరిశీలిస్తున్న బృందం.. పరిశోధనాసక్తి గల ప్రాంతాల్ని గుర్తించి రోవర్‌ను అక్కడికి పంపేందుకు ప్రయత్నిస్తోంది. పర్‌సివరెన్స్‌ రోవర్‌ కు అమర్చిన రెండు మీటర్ల రోబోటిక్ ఆర్మ్.. మార్స్ పై గుంత తవ్వింది. అయితే రాతి నమూనాలు సేకరించి భద్రపర్చుకోలేక పోయిందని నాసా తెలిపింది. గతేడాది జూలై 30న పర్‌సివరెన్స్‌ రోవర్‌ లాంచ్ చేశారు. 203 రోజులు.. 472 మిలియన్ కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఫిబ్రవరి 18న రెడ్ ప్లానెట్ చేరింది. మార్టిన్ రాక్ ను సేకరించే తొలి మిషన్ అదే.

Post a Comment

0 Comments

Close Menu