తొలి ఫీచర్​ ఫోన్​కి 21 ఏళ్లు...!

 తొలి ఫీచర్​ ఫోన్​కి 21 ఏళ్లు...!

మొబైల్ ఫోన్ వాడకం మొదలైన తొలినాళ్లలో వినియోగదారులందరూ నోకియా ఫీచర్‌ ఫోన్లనే  వాడేవారు. మొదటి జీతంతోనో లేదా పండుగ సందర్భంగానో కొనుగోలు చేసిన తొలి మొబైల్


ఫోన్లుగా ఇవి అందరి హృదయాల్లో చోటు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఎన్ని 4జీ, 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. నోకియా ఫీచర్​ ఫోన్లను చూస్తే అందరికీ మధుర క్షణాలు గుర్తొస్తాయి.ఈ తొలితరం మొబైల్ ఫోన్లు పవర్ ఫుల్ బ్యాటరీతో, దృఢమైన డిజైన్లతో యూజర్లు బాగా ఆకట్టుకునేవి. వీటిలో ఉండే క్యారమ్స్‌, స్నేక్ గేమ్‌లు యూజర్లను బాగా ఎంటర్‌టైన్‌ చేసేవి. 1990 కాలం నాటి యూజర్లు ఇప్పటికీ ఫస్ట్ జనరేషన్ ఫీచర్ ఫోన్లను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఈ ఫోన్లతో గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటుంటారు. ఈ క్రమంలో కెనడియన్-అమెరికన్ నటుడు జోన్ ఎర్లిచ్‌మన్ ట్విట్టర్‌లో ఐకానిక్ నోకియా 3310 ఫోన్ ఫొటోను పోస్ట్ చేశారు. నోకియా 3310 విడుదలై 21 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయన ఈ ఫొటోను షేర్ చేశారు. దాంతో నెటిజన్లు తమ పాత జ్ఞాపకాలు పంచుకుంటూ మైమరిచిపోతున్నారు. 2000లో ఈ రోజున(సెప్టెంబర్ 1న) నోకియా 3310 విడుదలైందని జోన్ ఎర్లిచ్‌మన్ తన పోస్ట్ కి క్యాప్షన్ జోడించారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజానికి ఈ ఫోన్ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ల వలె సన్నగా ఉండదు. దీంట్లో టచ్‌ స్క్రీన్‌ కూడా లేకపోవడంతో టెక్స్ట్ మెసేజ్ లు పంపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది.

అయినప్పటికీ ఇది చాలామందికి ఫేవరెట్ ఫోన్ గా నిలిచిపోయింది. టెక్నాలజీ పెద్దగా అభివృద్ధి చెందనికాలంలో యువత టైంపాస్‌కు ఇందులోని స్నేక్ గేమ్ రోజంతా ఆడుకునేవారు. ఇప్పుడంటే.. కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్‌జీ, అస్ఫాల్ట్ గేమ్స్ తదితర హైడ్ ఎండ్ గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆ రోజుల్లో నోకియాలో ఉన్న స్నేక్ గేమే నంబర్ వన్ మొబైల్ గేమ్ గా అందర్నీ ఆకట్టుకునేది. ఈ ఫోన్ కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్​ ఇచ్చేది. జోన్ ఎర్లిచ్‌మన్ ట్వీట్ తో ప్రస్తుతం నెటిజన్లు.. ఈ ఫోన్ తో కాలక్షేపం చేసిన రోజులు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే మధురమైన పాత జ్ఞాపకాలను నెట్టింట్లోపంచుకుంటున్నారు. నోకియా తమ ఫేవరేట్ బ్రాండ్ అని కానీ ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగయ్యిందని కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఈ ఫోన్ ధర సుమారు రూ.8 వేలు ఉండేదని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఆ రోజుల్లో ఫోన్ కింద పడుతుందేమో.. డిస్‌ప్లే పగిలిపోతుందేమోననే భయాలు ఉండకపోయేవని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. రెండంతస్తుల భవనంపై నుంచి కింద పడిన తర్వాత సిమెంటు రోడ్డుకే చిల్లు పడింది కానీ తన నోకియా ఫోన్ కి ఏం కాలేదని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఇదొక అద్భుతమైన ఫోన్ అని కామెంట్లు చేస్తూ మరికొందరు తమ వద్ద ఉన్న పాత ఫోన్ల ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు.

Post a Comment

0 Comments