Header Ads Widget

ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ చిప్స్ కొరత

 ప్రపంచాన్ని సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరత వేధిస్తోంది. కోవిడ్‌ దెబ్బకు డిమాండ్‌ పెరిగి సప్లయ్‌ తగ్గిపోవడంతో చాలా కంపెనీలు ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్‌ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జియో ఫోన్‌ విడుదలపైనా చిప్ షార్టేజ్‌ ప్రభావం పడింది. యావత్‌ ప్రపంచాన్ని సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత వేధిస్తోంది. దీంతో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆటోమొబైల్ తయారీ కంపెనీలు వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. అతిపెద్ద యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా వాహనాల ఉత్పత్తిని 25 శాతం వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యం 40 శాతానికి తగ్గిపోవచ్చని ఆందోళన చెందుతోంది. అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజాలైన ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌ సహా జపాన్‌కు చెందిన టొయోటా నిస్సాన్‌ లాంటి సంస్థలు కూడా ప్రొడక్షన్‌ తగ్గించుకుంటున్నాయి. ఇక- ముఖేశ్‌ అంబానీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న జియో నెక్స్ట్‌ ఫోన్లపైనా ఈ ప్రభావం పడింది. వాహనాలు మొదలుకుని కంప్యూటర్లు, సెల్‌ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో సెమీకండక్టర్లుగా వ్యవహరించే సిలికాన్‌ చిప్‌లను వాడుతున్నారు. ఆయా ఉత్పత్తులు సక్రమంగా పనిచేసేందుకు చిప్‌లు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో బ్లూటూత్‌ కనెక్టివిటీ, డ్రైవర్‌ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ సిస్టమ్స్‌ లాంటి అధునాతన ఎలక్ట్రానిక్‌ ఫీచర్లతో కొత్త వాహనాల రూపకల్పనలో సెమీకండక్టర్ల వాడకం ఎక్కువైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గతేడాది చివరిలో సెమీ కండక్టర్ల కొరత తలెత్తింది. కరోనా మహమ్మారి వల్ల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాల్సి రావడంతో ఉన్నపళంగా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల డిమాండ్‌ పెరిగింది. ఆ సమయంలోనే కొవిడ్‌ కేసులు ఎక్కువవుతుండటంతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేశాయి. దాంతో ఉత్పత్తి, సరఫరాలో సమస్యలు తలెత్తాయి. చిప్స్‌ కొరతతో మన దేశంలోనే 169 పరిశ్రమలకు ఇబ్బంది పడుతున్నాయి. దేశీయంగా కంప్యూటర్ల, లాప్‌టాప్‌ల లభ్యతపై 5 నుంచి 10శాతం మేర ప్రభావం పడింది. చిప్‌సెట్‌ల దిగుమతిపై పూర్తిగా ఆధారపడిన దేశం మనది. ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు, వస్తువుల్ని కూడా ఇంపోర్ట్‌ చేసుకోవాల్సిందే. ఏటా 3 లక్షల కోట్ల విలువైన ఉపకరణాల్ని దిగుమతి చేసుకుంటున్నాం. సెమీకండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేయకపోతే చిప్‌ల కొరత లాగే.. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును గుర్తించిన చైనా సెమీకండక్టర్ల పరిశ్రమపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దాదాపు 50 బిలియన్‌ డాలర్ల మేరకు సబ్సిడీలు ఇస్తోంది. ఇక- చిప్‌సెట్లు అత్యధికంగా తయారు చేసే తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్‌ సంస్థలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఫోకస్‌ చేశాయి. సెమీకండక్టర్ల పరిశ్రమల్ని పెట్టాలంటే భారీగా ఖర్చవుతుంది. ప్రైవేటు రంగం ఒక్కటే అంత భారీ పెట్టుబడులు పెట్టడం కష్టమే. అందుకే ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తే.. ఆ తర్వాత నెమ్మదిగా పరిశ్రమ విస్తరించే అవకాశముంటుందని నిపుణులు సూచిస్తున్నారు. సెమీకండక్టర్ల విభాగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన తైవాన్‌ సెమీకండక్టర్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లాంటి సంస్థల్ని ఆహ్వానించి.. వాటి భాగస్వామ్యంతో ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలంటున్నారు. ఇండియా ఐటీ రంగంలో రెండున్నర లక్షల మందికి పైగా చిప్‌ డిజైనర్లు, టెస్టర్లు ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా 300 కంటే ఎక్కువ కంపెనీలు చిప్‌ డిజైనింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ విభాగాల్లో సేవలు అందిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో భారత్‌ కూడా త్వరగా ఎదిగే అవకాశముంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది గుర్తించిన టాటా గ్రూపు సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సెమీకండక్టర్‌ పరిశ్రమకు సంబంధించిన కీలక విడిభాగాల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమ స్థాపించే ఆలోచన ఉన్నట్లు ప్రకటించింది.

Post a Comment

0 Comments