Header Ads Widget

సీతారాం ఏచూరి ఇంటర్వ్యూ

  


ప్రశ్న:-ఇప్పుడు నయా ఉదారవాదం సైతం సంక్షోభంలో పడింది. అది కాస్తా కోవిడ్‌-19 వలన మరింత ముదిరిపోతున్నది. భవిష్యత్తు ఏమిటి ? ప్రత్యామ్నాయం ఏమిటి ?

ఏచూరి:- మన ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఏ మూలకూ చాలదన్న వాస్తవాన్ని కోవిడ్‌ మహమ్మారి చాలా సూటిగా బహిర్గతం చేసింది. దానితోబాటు ప్రజల జీవనోపాధిని కూడా కాపాడలేని వైఫల్యాన్ని బట్టబయలు చేసింది. చాలా తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో మనం ఇప్పుడు చిక్కుకుని వున్నాం.

ఇది అంతర్జాతీయ నయా ఉదారవాద పరిణామాలలో భాగమే. ఈ వ్యవస్థలో ప్రజలపై దోపిడీని తీవ్రతరం చేయడం ద్వారానే లాభాలను గరిష్ట స్థాయిలో పిండుకుంటారు. ఆ దోపిడీ పొదుపు చర్యలతో మొదలుబెట్టి వేతనాల కోత, ఉద్యోగాల తొలగింపు, చిన్న ఉత్పత్తిదారులను నాశనం చేయడం వంటి పలు పద్ధతుల్లో సాగుతుంది. 

మన దేశంలో పెద్ద నోట్ల రద్దు ద్వారా చిన్న ఉత్పత్తిదారులను దెబ్బతీశారు. దేశ ఆర్థిక వ్యవస్థ లోని అన్ని రకాల కార్యకలాపాలలోకీ నయా ఉదారవాదం చొరబడుతోంది. ఇప్పుడు కార్పొరేట్ల లాభాల కోసం కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రవేశ పెట్టడానికి, తద్వారా ఆహార ధాన్యాల కొరత సృష్టించడానికి సిద్ధపడుతున్నారు.

దిగజారిన ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా చేయడంలో నయా ఉదావాద విధానాలు ప్రపంచం మొత్తంగానే ఘోరంగా విఫలమైన వైనం ఇప్పుడు రోజురోజుకూ బైటపడుతోంది. అంతకంతకూ పెరిగిపోతున్న అసమానతలను గురించి హెచ్చరిస్తూ ది ఎకనామిస్ట్‌ పత్రిక ''ఈ అసమానతలు నేడు వ్యవస్థ అసమర్ధతకు సూచికగా మాత్రమే గాక వృద్ధి జరగడానికి ఆటంకంగా కూడా పరిణమిస్తున్నాయి'' అని పేర్కొంది. 

''అసమానతల మూల్యం'' అన్న తన పుస్తకంలో జోసఫ్‌ స్టిగ్లిట్జ్‌ అత్యంత సంపన్నులైప ఒక శాతం గురించి, తక్కిన 99 శాతం ప్రజల గురించి చర్చించారు. ముగింపులో ''ఇంత తీవ్రంగా మన సమాజంలో అసమానతలు గనుక లేకపోయినట్లైతే ఇంకా ఎంతో ఎక్కువ ఆర్థికాభివృద్ధి సాధించి వుండేవాళ్ళం'' అని పేర్కొన్నారు.

అన్ని సంపన్న దేశాలలోనూ ఉద్దీపన పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నారు. వాటి ద్వారా ప్రభుత్వాలే భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ విధంగా చేయడం నయా ఉదారవాద విధానానికి ఎంతమాత్రమూ పొసగని విషయం. దేశీయంగా ప్రజల కొనుగోలుశక్తిని పెంచేందుకు, ఆర్థిక కార్యకలాపా వేగం పెంచేందుకు ఈ ఉద్దీపన పథకాలు అవసరమయ్యాయి. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల ఒక ప్రసంగంలో ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాలన్న వాదనను ప్రతిపాదించారు. ఆ ప్రసంగం ''నేను కమ్యూనిస్టును కాను, కాని...'' అంటూ మొదలుపెట్టాడు.

మన దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి తిరస్కరిస్తోంది. కాని ఇంకోపక్క తన ఆశ్రిత కార్పొరేట్లు బకాయి పడ్డ భారీ మొత్తాలను మాత్రం మాఫీ చేసేస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజూ పెంచేస్తూ ప్రజల నడ్డి విరిగేలా భారాలను విధిస్తోంది. దాని వలన ద్రవ్యోల్బణం మరింత పెరుగుతోంది. దాని పర్యవసానంగా దేశీయంగా ప్రజల కొనుగోలుశక్తి మరింత కుంగిపోతోంది. మరింత లోతుగా మాంద్యంలోకి కూరుకుపోతున్నాం.

ఈ ఉదారవాద విధానాల బాటలో సాగిన ప్రయాణాన్ని దేశంలో మనమంతా తీవ్రంగా పునరాలోచించాలి. వ్యవసాయాన్ని, ఆహార భద్రతను బలపరుచుకోవడం, ప్రజారోగ్యం, విద్య వంటి రంగాలను బలోపేతం చేయడం, ఆర్థిక, సామాజిక మౌలిక వసతుల కల్పన పెంపొందించుకోడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, తద్వారా ఉద్యోగాలను కల్పించి దేశీయ కొనుగోలుశక్తిని పెంచడం - ఇవి మన ప్రాధాన్యతలుగా ఉండాలి.

ప్రశ్న:- మన ప్రభుత్వం ఈ నయా ఉదారవాద విధానాల వైపు మొగ్గడం వలన నేటి ప్రపంచ రాజకీయాలలో భారతదేశం అనుసరించే వైఖరి మీద ఎటువంటి ప్రభావం పడుతుంది ?

ఏచూరి:- ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో దీర్ఘకాలం నుండీ కొనసాగుతున్న సంక్షోభం కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా మితవాదం వైపు మొగ్గు వ్యక్తం ఔతోంది. లాభాలను గరిష్టంగా పిండుకునే క్రమానికి ఎటువంటి ఆటంకం కలిగినా అది ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. మితవాద రాజకీయాల వైపు మొగ్గితే అది ఉద్వేగాలను రెచ్చగొట్టి జాతి విద్వేషం, విదేశీయుల పట్ల విద్వేషం, వంటి ధోరణులు ప్రబలడానికి దోహదం చేస్తుంది. అవి ప్రజలలో చీలికలకు దారితీస్తాయి. 

మితవాద రాజకీయాలు ప్రజాస్వామ్య హక్కులను, పౌర స్వేచ్ఛను అణచివేయడానికి తోడ్పడతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో సాగుతున్న దోపిడీపై కార్మిక వర్గం సాగిస్తున్న పోరాటం ఐక్యంగా ముందుకు సాగకుండా చీలికలు సృష్టిస్తాయి.

మతపరంగా ప్రజలు చీలిపోవడం, మైనారిటీ మతస్తులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత, విషమయ ప్రచారం పెరగడం ద్వారా భారతదేశంలో ఈ మితవాదం వైపు మొగ్గు కొనసాగుతోంది. ఈ ధోరణి ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు ప్రాజెక్టును ముందుకు కొనసాగించడానికి తోడ్పడుతుంది. సహజంగానే ఇది నియంతృత్వం పెరగడానికి, అది ఫాసిస్టు రూపం తీసుకోడానికి దారితీస్తుంది.

ప్రత్యేకించి 2014 నుండీ కార్పొరేట్‌ శక్తుల, మతతత్వ శక్తుల కూటమి రూపొందింది. వారి నడుమ బంధం నిరంతరం బలపడుతోంది. అతి హీనమైన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇది దారి తీస్తోంది. కార్పొరేట్‌ క్రోనీలు పెద్ద ఎత్తున సంపద కొల్లగొడుతున్నారు. తాజాగా ప్రకటించిన జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ తో మన దేశపు జాతీయ సంపదనంతటినీ భారీగా కొల్లగొట్టేందుకు మార్గం చేస్తున్నారు. ఇది అడ్డూ, ఆపూ లేని నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలలో భాగమే. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇది తోడ్పడుతుంది.

అంతర్జాతీయ సంబంధాలలో భారతదేశం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి తోకగా మారడానికి, అమెరికా చెప్పుచేతలలో వ్యవహరించడానికి మాత్రమే ఈ అవధులు లేని నయా ఉదారవాద సంస్కరణలు దారి తీస్తాయి. అభివృద్ధి చెందే దేశాల నాయకుడిగా, అలీనోద్యమానికి మొనగాడిగా అంతర్జాతీయ సంబంధాలలో మన దేశానికి ఒకప్పుడు ఉన్న పేరు ఇప్పుడు చరిత్ర పుటలకే పరిమితం అయిపోయింది.

ప్రస్తుతం కార్పొరేట్‌-మతతత్వ శక్తుల కూటమి ఆధ్వర్యంలో దూకుడుగా అమలు జరుగుతున్న నయా ఉదారవాద సంస్కరణలు, అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా నడుచుకోవడం అనేది, అంతా ఒక గుండుగుత్త పథకం. లౌకికప్రజాస్వామ్య గణతంత్రంగా మన రాజ్యాంగం నిర్వచించిన మన భారతదేశాన్ని ఒక పచ్చి విద్వేషపూరిత, మత, ఫాసిస్టు, రాజ్యంగా,' హిందూ రాష్ట్ర'గా సమూలంగా మార్చివేయడమే ఆ పథకం అసలు లక్ష్యం.

Post a Comment

0 Comments