Header Ads Widget

ఆమె ఒక జీవితోత్సవం

 

✍️ డా. మోహన్ కందా

విశ్రాంత చీఫ్ సెక్రటరీ, ఉమ్మడి ఆం.ప్ర. ప్రభుత్వం

మా కల్పకం అక్క సెప్టెంబరు 25, 2021న తన 88వ ఏట కనుమూసిన విషయాన్ని వార్తగా ఇస్తూ సీతారాం ఏచూరి మాతృమూర్తి మృతి అని శీర్షిక పెట్టాయి చాలా పత్రికలు. సీతారాంకు ప్రస్తుతం జాతీయస్థాయిలో ఉన్న ఖ్యాతిని బట్టి అలా పెట్టి ఉండవచ్చు కానీ అక్క సొంత ప్రతిపత్తి, స్వయంప్రకాశం కలిగిన ధీరమహిళ. అనేక విద్యలలో ఆరితేరిన వ్యక్తి. పలు సంస్థల ద్వారా బహుముఖాలుగా సమాజసేవ చేసి మా అమ్మ కందా పాపాయమ్మగారికి తగిన కూతురనిపించుకుంది.

కందా కల్పకంగా ఉండగా శాస్త్రీయ నృత్యకారిణిగా, ప్రదర్శనలిచ్చి డాన్సర్‌గా అనేక పతకాలు గెలుచుకుంది. ఏచూరి కల్పకంగా మారాక మహిళా ఉద్యమంలో ప్రధాన భూమిక వహించింది. భూటాన్‌లోని ఫుంట్‌షోలింగ్‌లో నివాసముండగా భర్తతో కలిసి ఒక గుడి కట్టించే బాధ్యత తీసుకుంది. వృద్ధాప్య సమస్యలు కొద్దిగా బాధించినా, చివరివరకూ ఆమెలో ఉత్సాహం ఉరకలు వేస్తూనే వుంది. 

పేపర్లు, పుస్తకాలు చదువుతూ, టీవీలో సినిమాలు చూస్తూ, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో సైతం చురుగ్గా ఉంటూ బంధుమిత్రులతో సంబంధాలతో చురుగ్గా ఉంది. 35ఏళ్ల మనుమడు అశీష్ (సీతారాం కుమారుడు) అకాల మరణం మానసికంగా కుంగదీయకుండా ఉంటే ఇంకా కొంతకాలం జీవించేదనే నా నమ్మకం. 

నేను పుట్టేనాటికి తనకు పన్నెండేళ్లు. మా ఇద్దరికీ మధ్య ఎవరూ లేరు. మా అమ్మకు అనేక గర్భస్రావాలు జరిగాయి. నేను కూడా ఏడో నెలలోనే అర్భకంగా పుట్టాను. అమ్మతో పాటు తను కూడా నన్నెంతో శ్రద్ధగా పెంచిందని చెప్పాలి. నిజం చెప్పాలంటే తను నాకు రెండో అమ్మ. నన్ను ఎప్పుడూ వెంటే తిప్పుకునేది. అక్క పట్ల ఆరాధనాభావంతో నేను తన చుట్టూనే తిరిగేవాణ్ని. 

మా బావగారు ఏచూరి సర్వేశ్వర సోమయాజులు గారు ఆటోమొబైల్ ఇంజనీరింగు చదివి, ఎపిఎస్ ఆర్టీసిలోను, కేంద్రప్రభుత్వంలోను వివిధ నగరాల్లో ఉన్నతోద్యోగాలు చేశారు. యునైటెడ్ నేషన్స్ తరఫున విదేశాల్లో పనిచేసి, తర్వాత ఢిల్లీ వచ్చి 1999లో చనిపోయారు. చాలా మంచి మనిషి. పెళ్లయ్యాక కూడా అక్కను చదువుకోమని, సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనమని ప్రోత్సహించారు.

వివాహితగానే అక్క బెనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేసింది. 1960లలో ఉస్మానియా యూనివర్శిటీలో ఇండియా అండ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సబ్జక్టులో ఎంఫిల్ చేసింది. సరిగ్గా నేనప్పుడే ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ మాథ్స్ చేస్తున్నాను. 

నేను ఐఏఎస్‌కి ప్రిపేరయ్యేటప్పుడు పొలిటికల్ సైన్స్‌లో కోచింగ్ కోసం ఒక ప్రొఫెసర్‌ను ఏర్పాటు చేసింది. నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్లినపుడు అక్కాబావా దగ్గరే ఉన్నాను. వాళ్లు నాకు అమ్మానాన్నల్లాటి వాళ్లే. వాళ్లకి పెళ్లయిన నాలుగేళ్లకు సీతారాం పుట్టాడు. యూనివర్శిటీ చదువు తర్వాత అతడు రాజకీయాల్లోకి వెళ్లాడు. తర్వాతివాడు భీమశంకర్. మారుతి కార్పోరేషన్‌లో పనిచేసి రిటైరయ్యాడు. 

రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నపుడే అక్క ఆలిండియా విమెన్ కాన్ఫరెన్స్ కోసం పనిచేసింది. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళాసభలో చురుకైన పాత్ర వహించింది. రెండు నెలల క్రితమే తనకు కాకినాడలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అవార్డు ఫర్ విమెన్ ఎంపవర్‌మెంట్ అవార్డు ఇచ్చారు. 

కాకినాడ వికలాంగ బాలికల పాఠశాల, బాలభవన్‌ లకు కన్వీనరుగా ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్రమహిళా మండలి అక్షరాస్యతా ఉద్యమంలో సభ్యురాలిగా, సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా, రాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీలోను, ఆంధ్ర వనితామండలిలోనూ కోశాధికారిగా ఇలా అనేక సంస్థల్లో వేర్వేరు హోదాల్లో పనిచేసింది. 

వాతావరణ మార్పులపై జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి గ్లాస్గో, బ్రిటన్, డర్బన్, ఫ్లోరెన్స్, ఇటలీ, మలేసియాలు వెళ్లింది. అఖిల భారత మహిళా మోటర్ ర్యాలీలో గిరి మెమోరియల్ అవార్డు అందుకుంది. 

అక్కా బావా భూటాన్‌లో ఉండేటప్పుడే అక్కడ గుడి కట్టించారు. కొంతకాలం పాటు ఉగాండాలోని నైరోబీలో కూడా ఉన్నారు. ఎక్కడికెళ్లినా ఏదో పని కల్పించుకునేది. నేనంటే ఉన్న అభిమానం, ఆప్యాయత మా ఆవిడ (మా మావయ్య కూతురే) పిల్లల మీద, మనుమల మీద కూడా ప్రసరించింది.

నాకూ మా మేనల్లుళ్లకూ కూడా గట్టి బంధం ఉంది. సీతారాం చిన్నప్పుడు మా అమ్మగారింట్లోనే పెరిగాడు. మా కుటుంబాల మధ్య అన్యోన్యత అప్పటికీ, యిప్పటికీ ఒకేలా ఉంది. తన సుదీర్ఘ జీవనయానంలో కూతురిగా, భార్యగా, తల్లిగా, అత్తగారిగా, నానమ్మగా, తాతమ్మగా అన్ని పాత్రల్లో రాణించింది. నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టి చూపించింది కూడా. కుటుంబసభ్యులు భాషాంతర, కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నా ఆమోదించింది. మంత్రి దగ్గర నుంచి బంట్రోతు దాకా ఎవరినైనా సరే ఒకేలా పలకరించేది.

పేదవారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చేది. ఏ వయసువారితోనైనా సరే ఇట్టే కలిసిపోయేది. హాస్యచతురత అనేది మా కుటుంబంలోనే ఉంది. ఆమె తెలుగు, తమిళం, ఇంగ్లీషు కలిపి లిమరిక్కులు అల్లేది. ఎప్పుడూ గలగలా నవ్వుతూ మాట్లాడేది. తన అనారోగ్యం గురించి పెద్దగా మాట్లాడేది కాదు. 

అనాడీ హిందీ సినిమాలో ఓ పాట ఉంది. కి మర్‌కే భీ కిసీకో యాద్ ఆయేంగే, కిసీకీ ఆంసువోం మేఁ ముస్కురాయేంగే, కహేగా ఫూల్ హర్ కలీ సే బార్ బార్, జీనా ఇసీకా నామ్ హై అని. ఆ పాట అక్కకు సరిగ్గా వర్తిస్తుంది. జీవించడం అంటే ఇదే అని చాటి చెప్పిన అక్క కప్పూ అని ఆప్యాయంగా పిలిచే తన స్నేహితులను, మా బోటి రక్తబంధువులను విడిచి పైలోకాలకు వెళ్లిపోయింది. నాకు తెలుసు, ఈపాటికే అక్కడ దేవుడితో జోకులేస్తూ ఉంటుంది.

(ఆంధ్రజ్యోతి దినపత్రిక నుండి సేకరణ)

Post a Comment

0 Comments