ఆత్మయే మహా ప్రియమైనది

 

ఒకప్పుడు ఒక యాత్రికుడు కుటుంబసమేతంగా యాత్రలు చేయుచూ ఒక నదిని దాట వలసి వచ్చెను. ఆ సమయమున నదీ తీరమున పడవ నడుపు నావికుడు ఒక్కడూ కానరాలేదు.విధిలేని  పరిస్థితి లో నదిని స్వయముగా దాటవలెనని నిర్ణయించుకునెను.  డబ్బుమూటను నెత్తిపై పెట్టుకొని తన పిల్లవానిని భుజముపై కూర్చుండ బెట్టుకుని, భార్య చేతిని పట్టుకుని అతడు మెల్లగా నదిలోనికి దిగెను. అకస్మాత్తుగా నదికి వరదలు వచ్చినీటి ప్రవాహం పెరిగిపోగా ఈ యాత్రిక కుటుంబము నదీమధ్యభాగమున చిక్కుకొని ముందునకు పోవుటకుగాని వెనుకకు మరలుటకు గాని వీలు లేకుండాపోగా అతడు ఈ విధముగా ఆలోచింపసాగెను. "నీటిమట్టము పెరిగి నా కంఠమును తాకుచున్నది. గట్టుచేరు ఉపాయము గోచరించుటలేదు. ఇదే విధంగా వుండినట్లైన కాస్సేపటికి ప్రవాహ వేగమునకు అందరూ కొట్టుకునిపోయి మరణించ వలసివచ్చును. ఇపుడు కంఠమువరకు మునిగియున్నాను. నెత్తిపై డబ్బు సంచి  యుండుటవలన ఆ బరువుకు కదలలేకున్నాను. ఈ పరిస్థితిలో కొంచెము బరువు తగ్గించుకున్నచో ఇటునటు కదలి ఏదోవిధంగా ప్రాణరక్షణ చేసుకొనుటకు వీలుండును. కుమారుని వదలివేసెదను. ఇతడు మరణించినూ పిదప మరొకరిని సంతానము పొందవచ్చును. " తలచినదే తడవుగా కుర్రవాడిని జారవిడువగా పాపమాతడు ప్రవాహ వేగంలో కొట్టుకుపోయెను. అంతకంతకూ నీటివేగము ద్విగుణీకృతమగుచుండగా ఆ యాత్రికుడు ముందుకు కదలుటకు సామర్థ్యం మరింత తగ్గిపోగా తిరిగి ఆలోచనలో పడెను. "భార్యను పట్టుకునియుండుట వలన నన్ను నేనురక్షించుకొనజాలకున్నాను. భార్య పోతేనేమి!నా వద్ద డబ్బు వుండినచో ఇంకొకరిని కట్టుకుని సంసారము నడపవచ్చును. "  వెంటనే తన గృహిణిని కూడా వదలివేసెను. పాపమా పడతి ప్రవాహవేగమునకు కొట్టుకుని పోగా ఇతడు నెత్తిపైగల డబ్బుమూటను  మాత్రము మోయుచూ నదిదాటుటకు ప్రయత్నము చేయుచుండెను. కొంతసమయము గడచినది. ఇపుడు వరదతీవ్రతను తప్పించుకొనుటకు నెత్తిపైనున్న మూట మహా ప్రతిబంధక మనిపించి అతడు తన ప్రాణమును కాపాడుకొనుటకై చివరికి ఆ డబ్బుమూటనుకూడా నీటియందు వదలి వేసెను. ఇపుడు భారము తొలగి ఏదియో ఉపాయముచే చేతులు కాళ్లు ఆడించుచూ ఎట్టకేలకు బ్రతుకుజీవుడాయనుచు తీరమునకు చేరుకొనెను.

కొసమెరుపు:  ప్రపంచములో గల సమస్తపదార్థములకంటె తన ఆత్మనే ఈ మనిషి అధిక ప్రీతి కరముగా భావించుచున్నాడు. తన కొరకే ఈ మానవుడు ఇతరులను ప్రేమించుచున్నాడు.

Post a Comment

0 Comments