Ad Code

అప్రతిహతంగా సాగుతున్న 'మంగళ్‌యాన్‌'

 

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన మంగళయాన్‌ వ్యోమనౌక.. అంగారకుడి కక్ష్యలో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఆరు నెలలు పనిచేసేలా దీన్ని రూపొందించగా.. అది ఇప్పటికీ అద్భుతంగా సేవలు అందిస్తోంది. తాజా మైలురాయిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ వ్యోమనౌక ప్రయోగ సమయంలో ఆయనే సంస్థకు నేతృత్వం వహించారు. 2013 నవంబరు 5న మంగళయాన్‌ను ఇస్రో ప్రయోగించింది. ఆ మరుసటి సంవత్సరం సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి చేరింది. తద్వారా తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహాన్ని చేరిన మొట్టమొదటి దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. సాంకేతిక సత్తా ప్రదర్శన కోసమే ఈ వ్యోమనౌకను ప్రయోగించినప్పటికీ.. అనుకున్న లక్ష్యాలన్నింటినీ ఇది విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో అధికారులు తెలిపారు. దీనిద్వారా గ్రహాంతర యాత్రల విషయంలో అనేక కొత్త అంశాలను నేర్చుకున్నామని చెప్పారు. ఇలాంటి వ్యోమనౌకల్లోని వ్యవస్థలు, ఉప వ్యవస్థల డిజైన్, తయారీ, నిర్దిష్టంగా వ్యోమనౌకను వేరే గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం, అంగారక కక్ష్యలో ఉండగా శాస్త్రీయ పరికరాల నిర్వహణ వంటివాటిపై అనేక విషయాలు తమకు అవగతమయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని గ్రహాంతర యాత్రలు చేపట్టేలా తమ విశ్వాసాన్ని ఇవి పెంచాయని తెలిపారు. ఈ వ్యోమనౌకను, అందులోని ఐదు శాస్త్రీయ పరిశోధన పరికరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అక్కడి నుంచి వచ్చిన డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఈ వ్యోమనౌకలోని కదిలే భాగాల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంగళయాన్‌కు ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎం.అన్నాదురై తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయ పరికరాలను వినియోగించాల్సి వస్తోందని వివరించారు. మొత్తంమీద ఈ వ్యోమనౌక చాలావరకూ బాగానే ఉందన్నారు. మరో ఏడాది పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. ఇంత దీర్ఘకాలం పాటు ఇది సేవలు అందించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ''చంద్రయాన్‌-1 వ్యోమనౌక ప్రయోగ సమయంలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా కొన్ని సర్దుబాటు చేసుకున్నాం. వ్యోమనౌక డిజైన్‌లో మార్పులు, ఇంధన నిర్వహణ వంటి అంశాల్లో కొత్త విషయాలు నేర్చుకున్నాం'' అని వివరించారు. 

Post a Comment

0 Comments

Close Menu