Ad Code

ఎంవీ రమణారెడ్డి కన్నుమూత


వైద్యుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, విప్లవ కమ్యూనిస్టు రచయితగా, రాజకీయ నాయకుడిగా మారిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్. ఎంవీ రమణారెడ్డి (ఎంవీఆర్) బుధవారం ఉదయం కన్నుమూశారు. మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డిని కర్నూల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన దేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకు వెళ్లనున్నారు. విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల్లో రచయితగా రమణారెడ్డికి గుర్తింపు ఉంది. నీటి పారుదల రంగం పైనా ఆయన విశ్లేషణలు రాసేవారు. రాయలసీమ విమోచన సమితిని కూడా ఆయన స్థాపించారు. తెలుగు భాషపై ఆయనకు మంచి పట్టుంది. వ్యాకరణంపై ఆయన ఓ పుస్తకం కూడా రాశారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమణారెడ్డి ప్రస్తుతం వైసీపీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. ''మనిషి కాకిగా బతకడం కంటే.. మనిషి ఓ మనిషిగా బతకాలి. అంటే అతని వల్ల సమాజానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. నేను రచయితను.. కానీ నేను సమాజానికి చేయగలిగిన ప్రయోజనం ఏమిటంటే, నా రచనల ద్వారా సమాజానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం''అని బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో రమణారెడ్డి వివరించారు. భిన్న రంగాల్లో నైపుణ్యం సాధించడంపై ఆయన స్పందిస్తూ.. ''నా జీవితం చాలా మలుపులు తిరిగింది. అవేమీ నేను ముందుగా అనుకొని చేసింది కాదు. డాక్టర్‌ను కావాలని మాత్రమే నేను అనుకున్నాను. వైద్యం నుంచి ట్రేడ్ యూనియన్‌కు మొదటవచ్చాను. నిజానికి నాకు ట్రేడ్ యూనియన్ గురించి తెలియనే తెలియదు.'' 'నేను పేదల డాక్టర్‌గా పనిచేసేవాణ్ని. అప్పుడు నా దగ్గరకు కొంతమంది వర్కర్లు వచ్చేవారు. ఆ వర్కర్లు తమ చిన్న పిల్లలను తీసుకొని వచ్చేవారు. కానీ మందులు కొనడానికి వారి దగ్గర స్థోమత ఉండేదికాదు. దీనికి పరిష్కారంగా నేను ట్రేడ్ యూనియన్‌లోకి అడుగుపెట్టాను.'' ''నేను మొదట ప్రొద్దుటూరులో మాత్రమే సేవలు అందించేవాణ్ని. అయితే, నాకు సాయం చేయాలని రాయలసీమలోని భిన్న ప్రాంతాలకు చెందినవారు వచ్చేవారు. చాలామంది వర్కర్లు వచ్చేవారు. అలా చాలా ప్రాంతాల్లో యూనియన్లు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఆ పని చాలా ఎక్కువ కావడంతో, నా మెడికల్ ప్రాక్టీస్‌ను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రాయలసీమలోని పెద్దల అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక యువ సమాఖ్యను స్థాపించాల్సి వచ్చింది''అని ఆయన వివరించారు. 

Post a Comment

0 Comments

Close Menu