ఆటో డ్రైవర్‌పై పగబట్టిన కోతి


అల్లరికి, పిచ్చి చేష్టలకు మారుపేరైన కోతి ఓ వ్యక్తి పాలిట విలన్‌గా మారింది. అతనిపై పగ పెంచుకున్న కోతి ప్రతీకారం తీర్చుకునేందుకు 22 కిలోమీటర్లు ప్రయాణించింది. కోతి దాడి భయంతో ఆ వ్యక్తి 8 రోజులుగా ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేదు. అయితే కనిపించిన వస్తువులను లాక్కోవడం, కొంటె పనులు చేయడం కోతుల లక్షణమే కానీ బోనెట్‌ మకాక్‌ జాతికి చెందిన ఈ కోతి కాస్తా వింతగా ప్రవర్తించింది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగెహారా గ్రామంలో ఒక చిన్న కోతి ఒక స్కూల్ దగ్గర స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేది. రోజురోజుకీ దాని అల్లరి ఎక్కువై మనుషులపై దాడి చేస్తుండంతో పాఠశాల అధికారులు అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. హైపర్యాక్టివ్ కోతిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు కొంతమందిని పిలిపించారు. వారిలో జగదీష్ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు.ఇతను కోతిని పట్టుకోవడానికి అధికారులకు సాయం చేస్తుండగా కోతి అతని మీదకు ఎక్కి దాడి చేసింది. భయపడిపోయిన అతను తన ఆటోలో దాక్కున్నాడు. అది గమనించిన కోతి.. ఆటో టాప్‌, సీట్లను చించి.. జగదీశ్‌పై మళ్లీ దాడి చేసింది. చివరికి 3 గంటల తరువాత 30 మంది కష్టపడి కొతిని పట్టుకున్నారు. దీంతో కోతిని అటవీ శాఖ అధికారులు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలూర్ అడవిలో వదిలేశారు. అయితే కొన్ని రోజులకు బాలూర్‌ అడవి నుంచి తప్పించుకున్న కోతి లారీ మీద ఎక్కి 22 కిలోమీటర్లు ప్రయాణించి మళ్లీ గ్రామానికి చేరుకుంది. తనను పట్టించిన జగదీశ్‌పై కోపం పెంచుకున్న ఆ వానరం అతని వెంట పడింది. దీంతో భయపడిపోయిన అతను 8 రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. చివరికి విషయం తెలుసుకున్న అధికారులు కోతిని బంధించి తీసుకెళ్లారు. 

Post a Comment

0 Comments