తాపీ ధర్మారావు
Your Responsive Ads code (Google Ads)

తాపీ ధర్మారావు

 " దేవుడివైపు కాళ్ళు పెట్టి చదువుకుంటున్నావేమిటి ? తియ్ ! 

 అని కోప్పడిన తల్లితో  "దేవుడు ' అందుగలడిందులేడని సందేహంబు వలదు 'అన్నారు కదమ్మా ! మరి కాళ్ళెక్కడ పెట్టుకోవాలి ? " అని కుర్రతనంలోనే అహేతుక భావాలను ప్రశ్నించిన గడుగ్గాయి.  నూనె కావడి ఎదురొస్తే అశుభం'  అని  అందరూ వారించినా లెక్కచేయకుండా వెళ్లి ఎఫ్.ఏ పరీక్ష ఫస్ట్ క్లాసులో పాసైన తెలివైన నాస్తికుడు, పెద్దయ్యాక  దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు? అని ఆలొచించడమే కాక ఏకంగా పుస్తకమే రాసి భక్తజనావళికి  చెమటలు పట్టించిన హేతువాది,

 1887 సెప్టెంబర్ 19న బరంపురంలో పుట్టిన తాపీ ధర్మారావు గారి ఇంటిపేరు బండివారో బండారువారో అని ఉండేదట. వీరి తాతగారు తాపీ పనిలో పేరు తెచ్చుకోవడం వల్ల అదే ఇంటిపేరుగా స్థిరపడిపోయింది.  నూతన పోకడలపై మొదటినుంచీ ఆసక్తే బడి రోజుల్లోపంచెకట్టుకోవాలనిపించి అందరూ ఎడమచేతి వైపు గోచీ పెడితే " ఏం ? అలాగే ఎందుకు కట్టాలి ?అంటూ కుడిచేతివైపు పెట్టి కట్టుకుని బడికి వెళ్లారు. అందరూ నవ్వారు.

మాస్టారు హెచ్చరించారు." నేనిలాగే కడతానని ఎదురు చెప్పడమే కాదు. జీవితాంతమూ అలాగే కట్టారు. తన పెళ్లి విషయంలో ఆనాటి సంప్రదాయం పై తిరుగుబాటు: పెళ్లి చూపుల్లో-పిల్లకు చదువు తప్పని సరి. పెళ్ళికిముందు ఒకరినొకరు చూసుకోవాలి. కట్నాల ప్రసక్తి కూడదు. భార్యను ఏమేవ్ , ఏయ్ అని కాకుండా పేరుపెట్టి  పిలుచుకోవాలి. నాటకాలకు వెళ్ళినప్పుడు వెంటతీసుకెళ్లి తన పక్కనకూర్చోబెట్టుకోవాలి. అనే షరతులు పెట్టారు.  ఈనాడివి అల్ప విషయాలు. కానీ 1902-1903 కాలంలో అభ్యుదయ భావాలు. లెక్కల మాస్టారుగా ఉద్యోగం ప్రారంభించి  ఉప్పల లక్ష్మణరావు గారూ వి.వి.గిరి వంటి గారికీ పాఠాలు చెప్పారు. కొన్నాళ్ళు  సర్వే డిపార్టుమెంట్ లో పనిచేసి,తరువాత ట్యుటోరియల్ కాలేజీ నడిపారు. బొబ్బిలి రాజా సోదరుడికి ట్యూటర్ గా పనిచేశారు. చివరకు పత్రికా రంగంలో స్థిరపడ్డారు. దేవాలయాలపై కనిపించే బూతుబొమ్మలన్నీ గుడులలో  జరిగే  సంగమాలను తెలిపేవే అంటూ 1936లో ప్రజామిత్ర పత్రికలో రాసిన వ్యాసాలను   'దేవాలయాలమీద  బూతుబొమ్మలెందుకు ?" అనే పుస్తకంగా ప్రచురించారు. అదే పత్రికలో  ' కొత్తపాళీ '  వ్యాసాలను ధారావాహికంగా ప్రచురించారు.  తనకు పుట్టినవాడే తన ఆస్తికి వారసుడు కావాలన్న తపనే ఇనుప కచ్చడాలు' 'కు మూలం అన్నారు. 'అడగజాలనివాడు అనే పేరుతొ రాసిన వ్యాసాలను " ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ" పుస్తకంగా వెలువరించారు. ఆదిలో మగపెళ్లి వారూ ఆడపెళ్ళివారూ తప్ప మరొకరితో నిమిత్తం లేకుండా ఒకరికొకరు తమలపాకులు ఇచ్చుకోవడం వంటి అతి సామాన్య తంతులోకి పిలవని పేరంటంగా పురోహితుడు ప్రవేశించి ఏవోవో మంత్రాలు అల్లి నానా రకాల కర్మకాండను కల్పించి పెళ్లిని " పెద్ద భూతంగా ఎలా మార్చాడో   " పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు" లో వివరించారు. 1937లో సినీరంగం లో అడుగుపెట్టి మొదట " మోహినీ రుక్మాంగద " కీ చివరగా 1962లో " భీష్మ సినిమాకీ సంభాషణలు రాశారు. చేమకూర వెంకటకవి ' విజయవిలాస' కావ్యానికి సహృదయోల్లస వ్యాఖ్య రాసి సంప్రదాయ పండితుల ప్రశంసలందుకున్నారు. ఏదైతేనేం వెయ్యిముఖాలతో వెలిగిన జీవితం పూలబాటలూ ముళ్లపుంతలూ చవిచూసిందని " రాళ్ళూ రప్పలూ "  వర్ణించిన 86 సంవత్సరాల జీవితం అలసిపోయి *1973 మే 8 న శాశ్వత విశ్రాంతి తీసుకుంది.  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog