Ad Code

మళ్లీ పేలిన వన్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌

 

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీదారు వన్‌ ప్లస్‌ నుంచి విడుదలైన నార్డ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ సంస్థకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ తన దగ్గరున్న వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 5G ఫోన్‌ పేలిపోయిందని చెప్పిన ఘటన మరవక ముందే, మరోసారి ఈ ఫోన్‌ పేలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కేరళకు చెందిన జిమ్మీ జోస్‌ అనే వ్యక్తి వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 5జీ ఫోన్‌ ఛార్జ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఛార్జర్‌ పేలిపోయిందని తెలిపారు. ఇది ఎలా పేలిందనే వివరాలన్నీ పూసగుచ్చినట్టు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని వన్‌ప్లస్‌ సంస్థ గుర్తించింది. కానీ ఎప్పటిలాగే ఈ ఘటనలో తమ ఫోన్‌ లోపం ఏ మాత్రం లేదని, వోల్టేజ్‌ ఫ్లక్చువేషన్స్‌ వల్ల అది పేలి ఉండవచ్చని పేర్కొంది. కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జిమ్మీ జోస్‌.. తన వన్‌ ప్లస్‌ నార్డ్ 2 5జీ ఫోన్‌ ఛార్జింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పెద్ద శబ్ధంతో ఛార్జర్‌ పేలిపోయిందని చెప్పారు. ఆ తీవ్రతకు కనెక్ట్‌ చేసిన సాకెట్‌ దూరంగా ఎగిరిపోయిందని తెలిపారు. అయితే ఫోన్‌ మాత్రం పనిచేస్తోంది. ఈ ప్రమాదంలో తనకు పెద్ద గాయాలేమి కాలేదు కానీ అది పెద్ద షాక్‌ ఇచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన వెంటనే వన్‌ ప్లస్‌ సంస్థకు తెలియజేయగా వారు కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ సందర్శించాలని సూచించారు. కరెంట్‌ ఎక్కువ రావడం వల్ల ఛార్జర్‌ పేలి ఉంటుందని వన్‌ ప్లస్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ వారు తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న జోస్‌, ఫోన్‌ ఛార్జింగ్‌ చేసేందుకు తాను వోల్టేజ్‌ స్టెబిలైజర్‌ కూడా కొనుగోలు చేసే ఉండాల్సిందని కామెంట్‌ చేశారు. పేలిపోయిన ఛార్జర్‌ తీసుకొని కొత్త ఛార్జర్‌ ఇచ్చింది వన్‌ప్లస్‌. తమ లోపం కాదని కంపెనీ చెప్తున్నా, అక్కడి టెక్నిషియన్లు మాత్రం స్విచ్‌ ప్యానెల్‌/సాకెట్‌లో లోపం లేదా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పేలి ఉండవచ్చని విశ్లేషించారు. దాన్ని పేలుడుగా పరిగణించరాదని అంటున్నారు. ఇలాంటి ఘటనలను తాము తీవ్రంగా తీసుకుంటున్నామని న్యూస్‌18కు ఇచ్చిన వివరణలో వన్‌ ప్లస్‌ ప్రతినిధి తెలిపారు. వన్‌ ప్లస్‌ ఛార్జర్లలో బిల్ట్ ఇన్‌ కెపాసిటర్లు ఉంటాయని, ఈ ఘటనలో పవర్‌ స్టోర్ చేసే ఆ కెపాసిటర్లు యథాతథంగా ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇతర ఎక్స్‌టర్నల్‌ కారణాల వల్లే పేలి ఉంటుందని వివరించారు. అంతే కాదు, యూజర్ మ్యానువల్‌లో సూచించిన ముందు జాగ్రత్తలు, హెచ్చరికలను యూజర్లు పాటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ దగ్గర కూడా ఈ వన్‌ప్లస్‌ నార్డ్ 2 స్మార్ట్‌ ఫోన్ పేలిపోయింది. ఈ పేలుడు కారణంగా తాను గాయపడ్డానని కూడా ఆ లాయర్ తెలిపారు. దీనిపై వన్‌ ప్లస్‌ స్పందించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు చేపడతానని ప్రకటించారు. మరో వైపు ఈ విషయంలో వన్‌ ప్లస్‌ సంస్థ ఆ ఢిల్లీ లాయర్‌కు లీగల్‌ నోటీసు పంపించింది. తమ కంపెనీని అపఖ్యాతి పాలుజేయరాదని, సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగులు తొలగించాలని కోరింది. ఈ తరహా ఘటనే బెంగళూరులో కూడా జరిగింది. ఒక మహిళ బ్యాగులో వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 5జీ ఫోన్‌ పేలిపోయింది. ఆమె విషయంలో కూడా కంపెనీ తమ తప్పేమీ లేదని, ఇతర కారణాల వల్లే పేలుడు జరిగి ఉంటుందని చేతులు దులుపుకుంది.

Post a Comment

0 Comments

Close Menu