Ad Code

ఎలక్ట్రిక్​ ఎయిర్​ ట్యాక్సీని పరీక్షిస్తున్న నాసా

 

బ్యాటరీల సాయంతో విమానం ఎగిరే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం వాడుతున్న ఇంధనంతో సంబంధం లేని విమానయానాన్ని మనం చూడగలం. విమానయాన రంగం ఇంధన విమానాల నుంచి హైబ్రీడ్, ఎలక్ట్రిక్ విమానాల వైపు చాలా వేగంగా మళ్లడమే దీనికి కారణం. అందులో భాగంగానే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్ట్రిక్​ ఎయిర్​ ట్యాక్సీని పరీక్షించడం మొదలుపెట్టింది. జోబీ ఏవియేషన్​తో కలిసి ఈ పరీక్షను చేస్తోంది. ఈ ఎయిర్​ ట్యాక్సీలను వ్యక్తులు, వస్తువులు తరలించడానికి వినియోగించనున్నారు. అమెరికా, కాలిఫోర్నియాలోని బిగ్ సుర్ సమీపంలో ఉన్న జోబి ఎలక్ట్రిక్ ఫ్లైట్ బేస్లో  సెప్టెంబర్ 10 వరకు ఈ పరీక్షను నాసా కొనసాగిస్తుంది. నాసా తన అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ  నేషనల్ క్యాంపెయిన్‌లో భాగంగా మొట్టమొదటి సారిగా ఈ ఎలక్ట్రిక్​ వెర్టికల్​ టేకాఫ్​ లాండింగ్​  విమానం పరీక్ష నిర్వహిస్తోంది. ఒకవేళ ఈ పరీక్ష విజయవంతం అయితే ఇక సామాన్య ప్రయాణికుడు సైతం ఈ ఎయిర్​ ట్యాక్సీలను బుక్​ చేసుకుని తమ గమ్యస్థానాలకు వెళ్లవచ్చు.

భవిష్యత్తులో eVTOL విమానాలు నగరాలు, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిర్ టాక్సీలుగా ఉపయోగపడతాయి. వాణిజ్య అవసరాల్లో భాగంగా ఈ ఎయిర్​ ట్యాక్సీలు సేవలు అందించనున్నాయి. అందుకే ఈ ఎయిర్​ ట్యాక్సీల పనితీరును నాసా పరిశీలిస్తోంది. పరీక్షల్లో భాగంగా వివిధ దశల్లో ఎయిర్​ ట్యాక్సీ శబ్ద తీవ్రతను రికార్డ్ చేయడానికి 50 కి పైగా మైక్రోఫోన్‌లను వాడనున్నారు. అమెరికాలో ఎయిర్​ స్పేస్​ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఎయిర్​ ట్యాక్సీలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వచ్చే రోజుల్లో చాలా సంఖ్యలో ఎయిర్​ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మోటర్లతో విమానాలు నడిపేందుకు పలు విదేశీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. లండన్-ఆమ్‌స్టర్‌డ్యామ్ మార్గంలో 2027 నాటికి ఎలక్ట్రిక్ విమానాలు నడుపుతామని 'ఈజీ జెట్' గతంలోనే తెలిపింది. ఇక అమెరికాకు చెందిన ప్రాట్& విట్నీ సంస్థ, 'ప్రాజెక్ట్-804'పై పని చేస్తోంది. విమానాల కోసం 1 మెగావాట్ సామర్థ్యమున్న మోటర్‌, ఇతర అనుబంధ వ్యవస్థల గురించిన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రయోగంతో తాము 30% ఇంధనం పొదుపు చేస్తామని, 2022లో ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని సంస్థ గతంలో తెలిపింది. అయితే NASA AAM మిషన్ ఇంటిగ్రేషన్ మేనేజర్ డేవిస్ హ్యాకెన్‌బర్గ్ మాట్లాడుతూ.. AAM పరిశ్రమ టైమ్‌లైన్‌ను వేగవంతం చేయడానికి నేషనల్ క్యాంపెయిన్ డెవలప్‌మెంటల్ టెస్టింగ్ ఒక ముఖ్యమైన వ్యూహాత్మక దశ. ఇది ఎయిర్​ పరిశ్రమ పురోగతికి ఉపయోగపడేలా ఉండబోతుంది అని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu