ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) సౌర విద్యుదుత్పత్తి రంగంలో ఓ ముందడుగు వేసింది. నార్వేకు చెందిన 'ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్ ఏఎస్' అనే సంస్థను రిలయన్స్ అనుబంధ సంస్థ 'రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్)' కొనుగోలు చేసింది. ఈ డీల్ కోసం 771 మిలియన్ డాలర్లను వెచ్చించింది. నార్వేకు చెందిన ఈ కంపెనీ ఇప్పటి వరకు చైనా నేషనల్ బ్లూస్టార్ కో లిమిటెడ్ చేతిలో ఉంది. సింగపూర్‌లో ఆపరేషనల్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. నార్త్ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. సౌరవిద్యుత్తు రంగంలో ఆర్‌ఈసీ లీడర్‌గా నిలిచింది. అధిక సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానల్స్, సెల్స్‌ను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. దీనికి మూడు తయారీ కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో రెండు నార్వేలో ఉన్నాయి. ఇవి సోలార్ గ్రేడ్ పాలీ సిలికాన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మరో కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ఇది పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. ఆర్‌ఈసీ కంపెనీ ఉత్పత్తి చేసే ఆల్ఫా, ఆల్ఫా ప్యూర్ మాడ్యూల్స్ పరిశ్రమంలో అత్యధిక డిమాండ్ ఉంది. ఆర్‌ఈసీ సంస్థ హెటెరోజెంక్షన్ టెక్నాలజీని వాడి వీటిని తయారు చేస్తోంది. సాధారణ మాడ్యూల్ కంటే ఇవి శక్తిమంతంగా పనిచేస్తున్నాయి. సౌరశక్తి రంగంలో సృనాత్మక ఆవిష్కరణల్లో ఆర్‌ఈసీ కంపెనీ చాలా ముందుంది. దాదాపు 600 డిజైన్ పేటెంట్లు ఈ కంపెనీ పేరిట ఉన్నాయి. వీటిల్లో 446కు అనుమతులు రాగా.. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ కంపెనీ పరిశోధనలపై అత్యధికంగా దృష్టి పెడుతోంది. పీఈఆర్‌సీ టెక్నాలజీని తొలిసారి ఈ కంపెనీనే పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ రంగంలోని ప్రధాన కంపెనీలు మొత్తం ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్‌ఈసీలో 1,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు రిలయన్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యాజమాన్య మార్పిడీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యాక వారంతా రిలయన్స్ కుటుంబంలో భాగస్వాములు కానున్నందుకు హర్షం వ్యక్తం చేసింది. ఆర్‌ఈసీ సంస్థ త్వరలోనే సింగపూర్‌లో 2-3గిగావాట్ సెల్ , మాడ్యూల్స్ ఉత్పత్తి కేంద్రాన్ని విస్తరించనుంది. దీంతోపాటు ఫ్రాన్స్, అమెరికాలో 2 గిగావాట్ల సెల్, మాడ్యూల్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తోంది. రిలయన్స్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించింది.
0 Comments