Ad Code

వ్యక్తి చనిపోయాక గూగుల్ అకౌంట్లు ఏమైపోతాయి?

 

వ్యక్తి చనిపోయాక అతని గూగుల్​ అకౌంట్లలోని సమాచారం ఏమైపోతుంది? డేటాకు భద్రత ఉంటుందా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తుంటారు. అతడు బ్రతికున్నపుడు వాడిన జీ మెయిల్, మ్యాప్స్, సెర్చ్, గూగుల్ ఫొటోస్ వంటి గూగుల్ ఖాతాల్లో పూర్తిస్థాయిలో డేటా స్టోర్ అవుతుంది. గూగుల్​ పేలో బ్యాంక్ కార్డ్ వివరాలను కూడా చేసి ఉంటాయి. మరోవైపు, బంధుమిత్రుల వీడియోలు, ఫొటోలు సేవ్​ అయి ఉంటాయి. దీన్నిబట్టి గూగుల్ ఖాతాలో చాలా విలువైన డేటా ఉంటుందని చెప్పవచ్చు. అయితే, ఎవరికి ఎప్పుడు ప్రమాదం పొంచి ఉందో చెప్పలేం. అందువల్ల ఆ విలువైన డేటాను మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తికి అప్పజెప్పడానికి ఓ ప్రణాళిక రూపొందించుకోవడం అవసరం. ఎందుకంటే మీరు చనిపోయిన తర్వాత మీ గూగుల్ డేటాను ఆ వ్యక్తి సంరక్షిస్తాడు. మీరు మీ గూగుల్ ఖాతాను చాలా కాలం ఉపయోగించకపోయినా లేదా గూగుల్ సంస్థ మీ ఖాతాలో ఎలాంటి యాక్టివిటీని గుర్తించకపోయినా అది ఇన్‌యాక్టివ్‌గా మారిపోతుంది. అయితే మీ అకౌంట్ ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌గా మారాలో.. తరువాత మీ డేటాకు ఏమి జరగాలో నిర్ణయించడానికి గూగుల్ మీకు వీలు కల్పిస్తుంది. యూజర్లు తమ ఖాతాను, దాని డేటాను వారు విశ్వసించే వారితో షేర్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తుంది. లేదంటే యూజర్లు తమ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారితే దాన్ని డిలీట్ చేయమని కూడా గూగుల్‌ని అడగవచ్చు. "మీరు మీ గూగుల్ ఖాతాను కొంత సమయం పాటు ఉపయోగించకపోయినప్పుడు మీరు సెటప్ చేసిన ప్లాన్‌ను మేము అమలు చేస్తాం. మేము అలా చేయడానికి ముందు ఎంతకాలం వేచి ఉండాలో మాకు చెప్పండి" అని గూగుల్ మిమ్మల్ని అడుగుతుంది. ఉదాహరణకి ఒక సంవత్సరం పాటు మీ గూగుల్ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే దాన్ని డిలీట్ చేయమని లేదా ఇతరులకు అప్పచెప్పాలని మీరు గూగుల్‌ని అభ్యర్థించవచ్చు. మీ ఖాతా ఇన్‌యాక్టివ్‌ అయ్యిందని గూగుల్ పరిగణించడానికి అదనపు వెయిటింగ్ టైం పిరియడ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు గరిష్టంగా 18 నెలల వరకు సమయాన్ని ఎంచుకోవచ్చు. 18 నెలలు అని సెటప్ చేసుకుని మీరు ఆ ఖాతాను 18 నెలల పాటు ఉపయోగించకపోతే.. గూగుల్ మీ ఖాతాను ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తుంది. యూజర్లు myaccount.google.com/inactive సైట్‌ను సందర్శించి టైం సెట్ చేసుకోవచ్చు.

* myaccount.google.com/inactive సైట్‌ను సందర్శించిన తర్వాత మీరు మొదట ఇన్‌యాక్టివిటీ టైం పిరియడ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. జీమెయిల్  యూజర్లు తమకు తమ ఖాతా ఇన్‌యాక్టివ్‌ అయినట్లు తెలియజేసేలా ఓ ఆటో రిప్లైని కూడా సెటప్ చేసుకోవచ్చు. మీ గూగుల్ ఖాతా డేటాను ఎవరూ యాక్సెస్ చేయకూడదనుకుంటే.. మీరు ఎవరి ఈమెయిల్ ఐడీలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలా చేస్తే మీ డేటా డిలీట్ అవుతుందని గమనించాలి. అలాగే మీ డేటాను ఎవరు కూడా మళ్లీ రీస్టోర్ చేయలేరు.

* మీరు ఒక వ్యక్తి ఈ మెయిల్ ఐడీని యాడ్ చేసినట్లయితే, గూగుల్ ఒక పెద్ద లిస్ట్ చూపిస్తుంది. ఆ వ్యక్తితో మీరు ఏ డేటాను పంచుకోవాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఈ లిస్టులో గూగుల్ పే, గూగుల్ ఫొటోస్, గూగుల్ చాట్, లొకేషన్ హిస్టరీ, ఇంకా గూగుల్ అకౌంట్‌తో మీరు యాక్సెస్ చేసిన సమాచారం ఉంటుంది. మీ గూగుల్ అకౌంట్‌ ఇన్‌యాక్టివ్‌గా మారిన తర్వాత మీ విశ్వసనీయ కాంటాక్ట్‌కు కేవలం మూడు నెలలు మాత్రమే యాక్సెస్ ఉంటుందని గూగుల్ సంస్థ చెబుతోంది. సెటప్ సమయంలో మీరు రాసిన సబ్జెక్ట్ లైన్, కంటెంట్‌ తో కూడిన ఈమెయిల్ మీ విశ్వసనీయ కాంటాక్ట్‌కు అందుతుందని గూగుల్ వివరించింది. అలాగే గూగుల్ మీరు యాడ్ చేసిన జీమెయిల్ ఐడీకి మీ తరఫున ఒక ఈమెయిల్ పంపిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తుంది.

* ఒకవేళ మీరు మీ గూగుల్ ఖాతాను శాశ్వతంగా డిలీట్ చేయాలని ఎంచుకుంటే.. మీ మొత్తం డేటాను గూగుల్ డిలీట్ చేస్తుంది. యూట్యూబ్ వీడియోలు, ఇతర కంటెంట్ సహా మీరు పబ్లిక్‌గా షేర్ చేసిన డేటా అంతా డిలీట్ అయిపోతుంది.

Post a Comment

0 Comments

Close Menu