Ad Code

గోద్రేజ్ కుటుంబంలో చీలిక

 

సబ్బులు, గృహోపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ దిగ్గజం గోద్రెజ్‌ గ్రూప్‌నకు గోద్రెజ్‌ కుటుంబం సారథ్యం వహిస్తోంది. అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం ఈ కుటుంబంలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపార విభజన జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బయటి నుంచి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సలహాలు కోరినట్లు పేర్కొన్నాయి. 124 సంవత్సరాల క్రితం 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్త అవతారమెత్తిన అర్దెశిర్ గోద్రేజ్,  గోద్రేజ్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రేజ్ గ్రూపునకు ఆది గోద్రేజ్‌ (79) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు నాదిర్.. గోద్రేజ్ ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ అగ్రోవెట్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. వీరి కజిన్‌ జంషీద్‌ ఎన్‌ గోద్రేజ్.. గోద్రేజ్‌ అండ్‌ బోయ్స్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. గ్రూపును రెండుగా విభజించాలని భావిస్తున్నారని సమాచారం. దీంట్లో ఒకదానికి ఆది, నాదిర్‌ నేతృత్వం వహిస్తారు. మరో దాన్ని జంషీద్‌, ఆయన సోదరి స్మితా గోద్రేజ్‌ కృష్ణా నిర్వహిస్తారు. ఈ వార్తలపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన గోద్రేజ్ కుటుంబం.. ''తమ గ్రూపు సంస్థల్లోని వాటాదార్లకు లబ్ధి చేకూరేలా దీర్ఘకాల వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తున్నాం'' అని తెలిపింది. ఇందులో భాగంగా బయటి నుంచి కూడా సలహాలు కోరినట్లు పేర్కొంది. ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉండే బ్యాంకర్లు నిమేశ్‌ కంపానీ, ఉదయ్‌ కొటాక్‌తో పాటు న్యాయపరమైన వ్యవహారాల్లో పేరుగాంచిన జియా మోదీ, సిరిల్‌ ష్రాఫ్‌ సైతం ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu