Header Ads Widget

నెక్స్‌వేఫ్‌తో రిలయన్స్ ఒప్పందం

 

ముఖేష్ అంబానీకి చెందిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్స్ తదితర రంగాల్లో రాణిస్తోంది. సోలార్ ఎనర్జీ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్  రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ అనే ఓ కంపెనీని కూడా స్థాపించింది. తాజాగా ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్ జర్మనీలోని నెక్స్‌వేఫ్ జీఎంబీహెచ్ లో 25 మిలియన్ యూరోలు (రూ.218 కోట్లు ) పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. జర్మన్ కంపెనీకి చెందిన 39 మిలియన్ యూరోల విలువైన సిరీస్ సీ కంపెనీ ఆపరేషన్లు విస్తరించేందుకు ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్ వ్యూహాత్మక ప్రధాన పెట్టుబడిదారుగా ఉండనుంది. ఆర్ఐఎల్ కంపెనీ.. అధిక సామర్థ్యం కలిగిన మోనోక్రిస్టలైన్ సిలికాన్ పొరలను ఉత్పత్తి చేసే నెక్స్‌వేఫ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 86 వేల 887 సిరీస్ సీ ప్రాధాన్యత కలిగిన షేర్లను 287.73 యూరోల చొప్పున రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్ కంపెనీకి 36,201 వారెంట్లు ప్రతి సబ్జెక్టుకు 1 యూరో చొప్పున జారీ అవుతాయి. నెక్స్‌వేఫ్ సంస్థ కలిగి ఉన్న ఓ సొంత టెక్నాలజీ ఫోటోవోల్టాయిక్‌ సెల్స్‌ ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలదు. కంపెనీ ప్రకటన ప్రకారం ఈ టెక్నాలజీ సోలార్ ఫోటోవోల్టాయిక్‌ సెల్స్‌ ని తయారు కూడా చేయగలదు. ఇవి అతి తక్కువ ధరలో లభించే పునరుత్పాదక శక్తి అని కంపెనీ పేర్కొంది. ఈ టెక్నాలజీ చవకైన ముడి పదార్థాల నుంచి మోనోక్రిస్టలైన్ సిలికాన్ పొరలను అభివృద్ధి, ఉత్పత్తి చేయడం కోసం నేరుగా గ్యాస్ దశ నుంచి ఫినిష్డ్ దశలను అనుసరిస్తుంది. మధ్యలో ఎలాంటి తయారీ దశలు ఉండవు కాబట్టి ఖర్చు బాగా తగ్గుతుంది. ఇదే టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారతదేశంలో వందల కోట్ల మోనోక్రిస్టలైన్ సిలికాన్ పొరల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చెయ్యాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. దేశీయ, ప్రపంచ మార్కెట్లకు ఈ ఉత్పత్తులను సరఫరా చేయాలని నిశ్చయించింది. అధిక సామర్థ్యం, ​​మోనోక్రిస్టలైన్ గ్రీన్ సోలార్ వేఫర్స్ అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం ఇప్పటికే రిలయన్స్, నెక్స్‌వేఫ్ జాయింట్ స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.

2030 నాటికి 100 గిగా వాట్ పునరుత్పాదక శక్తిని (లేదా జాతీయ లక్ష్యంలో 22 శాతం) ఉత్పత్తి చేయడానికి ఆర్‌ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఒక ముందడుగు పడిందని చెప్పుకోవాలి. రిలయన్స్ సంస్థ పునరుత్పాదక శక్తిలో 75 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 5,000 ఎకరాలలో "ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్" అనే గిగాఫాక్టరీల ఏర్పాటుకు కూడా పెట్టుబడులు పెడుతోంది. ఈ కాంప్లెక్స్‌లో సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఒక ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీ కూడా ఉండనుందని తెలుస్తోంది. అప్పుడప్పుడు శక్తిని నిల్వ చేయడానికి ఒక అధునాతన ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ ఫ్యాక్టరీ... గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఒక ఎలెక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ.. హైడ్రోజన్‌ను మోటివ్‌గా మార్చడానికి ఒక ఫ్యూయల్-సెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రిలయన్స్ సంస్థ యోచిస్తోంది. అలాగే ఓ స్టేషనరీ పవర్ ఉండాలని భావిస్తోంది. ఈ కాంప్లెక్స్ గిగాఫ్యాక్టరీల కోసం సహాయక సామగ్రి, పరికరాలను తయారు చేయడానికి మౌలిక సదుపాయాలను కూడా కలిగి ఉంటుంది. రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మొదట హైపర్-ఇంటిగ్రేషన్, సైంటిఫిక్ నాలెడ్జ్, టెక్నాలజీ ఇన్నోవేషన్ ద్వారా ఎనర్జీ రంగంలో శక్తివంతులుగా మారుతామన్నారు. తరువాత క్లీన్ ఎనర్జీ డిమాండ్ పెంచడానికి.. ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి కృషి చేస్తామన్నారు. అక్టోబర్ 10న రిలయన్స్ మరొక ఎనర్జీ తయారీసంస్థలో వాటా కొనుగోలు చేసింది. రిలయన్స్ క్లీన్ ఎనర్జీ రంగంలో లక్ష్యాలను చేరుకునేందుకు మరిన్ని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది.

Post a Comment

0 Comments