Ad Code

ప్రపంచ ఫార్మసీగా భారత్‌ అవతరణ

 


భారత దేశం ప్రపంచ ఫార్మసీగా అవతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. ఇలా అవతరించడం గత 75 ఏండ్లలో ఆ దేశం సాధించిన విజయాల్లో ఇది అతి పెద్ద విజయమని అన్నారు. ఆరోగ్య సేవల పంపిణీపై భారత్‌ సహా అన్ని దేశాల్లో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం చూపిందని చెప్పారు. ఇంగ్లిష్‌ న్యూస్‌ ఛానల్‌ ఎన్డీటీవీ నిర్వహించిన 'స్వస్త్‌ భారత్‌.. సంపన్న్‌ భారత్‌' కార్యక్రమంలో ఆమె టెలిథాన్‌ ద్వారా పాల్గొని ప్రసంగించారు. పోలియో నిర్మూలన మొదలు అనేక వ్యాక్సిన్లను తీసుకురావడం, మాతాశిశు మరణాలను తగ్గించడం వరకు భాతరదేశం ప్రపంచ ఫార్మసీ వేదికగా నిలిచిందని సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. గత ఏడాదిన్నర క్రితం వ్యాప్తి చెందిన కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఆరోగ్య సేవలను అందించడం కొంత ఇబ్బందిగా మారిందని అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా టీబీ, నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌, ప్రసూతి, చిన్నపిల్లల ఆరోగ్య సేవలను అందించడంలో ఇబ్బంది కలిగిందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత శ్రద్ధ వహించి వీటిపై దృష్టిసారించాలని సూచించారు. భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు మరింతగా పెరుగనున్నాయని, రాజీలేకుండా వీటిని ఎదుర్కోవడంలో ముందుండాలని పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా పలు దేశాల్లో పేదరికం పెరిగిందని, ఫలితంగా పోషకాహార లోపంతో బాధపడే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ మనం నిశితంగా గమనిస్తూ ముందస్తు చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu