Header Ads Widget

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచారు. కలామ్ ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశారు.1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలామ్ తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను రెండవ స్థానంలో ఎంపికైయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, కలామ్ కుప్పకూలిపోయారు.2015 జూలై 27 న, 83 సంవత్సరాల వయసులో, గుండెపోటుతో మరణించారు. తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు, అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలామ్ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించారు.తండ్రి జైనులబ్దీన్, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్ట్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలామ్ తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు.అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు.1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగులో చేరాడు. కలామ్ సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన ఉపకారవేతనం రద్దుచేస్తాను అని బెదిరించారు.ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నారు.తరువాత డీన్ "కలామ్ నీకు తక్కువ గడువు ఇచ్చి, ఎక్కువ ఒత్తిడి కలిగించాను" అన్నారు.ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  నుండి ఏరోనాటికల్ ఇంజినీరింగులో పట్టా పొందిన తరువాత 1960 లో, కలామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డివో) వారి ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరారు.కలామ్ భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు, కానీ డిఆర్‌డివోలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరి, ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం  తయారీలో పనిచేసారు.1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. ఎస్ ఎల్ వి -III పరీక్ష విజయం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీశ్ ధావన్ ను పిలిచినప్పుడు, ఆయనతో పాటు వెళ్ళిన వారిలో అబ్దుల్ కలామ్ కూడా ఒకరు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలామ్ భయపడ్డారు.' నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి..?' అని సతీశ్ ధావన్ ను అడగగా.. ఆయన 'మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు., కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి' అని అన్నారు. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.1970, 1990 మధ్య కాలంలో, కలామ్ పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. 1970 లలో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. 1992 జూలై నుండి 1999 డిసెంబరు వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, డిఆర్‌డివో ముఖ్య కార్యదర్శిగా పనిచేసారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలామ్ రాజకీయ, సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 1998 లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టరు సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంటును (stent) అభివృద్ధి చేసారు. దీనిని "కలామ్-రాజు స్టెంట్" అని అంటారు. 2012లో, వీరిద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ కంప్యూటరును తయారు చేసారు. దీన్ని "కలామ్&రాజు ట్యాబ్లెట్" అని అంటారు. 2002 జూలై 18 న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవికి తమ  అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి  కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తమ మద్దతు తెలిపింది. ఆ పోటీలో వామపక్షవాదులు బలపరచిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్ అతని ఏకైక ప్రత్యర్థిగా నిలిచింది. ఆమె, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనిత. అతడు ప్రజల రాష్ట్రపతిగా పేరుపొందారు. లాభదాయక పదవుల చట్టంపై తీసుకున్న నిర్ణయం తన పదవీ కాలంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయంగా అతను భావించారు. తన పదవీ కాలంలో, 21 క్షమాభిక్ష అభ్యర్థనల్లో, 20 అభ్యర్థనల్లో నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అతను విమర్శలు ఎదుర్కొన్నారు. 2003 సెప్టెంబరులో, చండీగఢ్‌లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం, దేశా జనాభాను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అభిప్రాయపడ్డారు. కలామ్ 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. కలామ్ ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగారు, ప్రజలు కూడా కలామ్‌ను ఆదరించారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలామ్ 3వ వారు. 2007 జూన్ 20 తో తన పదవి కాలం పూర్తి అయింది. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నారు. కానీ చివరి క్షణాలలో వద్దని నిర్ణయించుకున్నారు. కలామ్ 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందారు.ఇస్రో, డిఆర్డిఓలతో కలిసి పనిచేసినందుకు, ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981 లో పద్మ భూషణ్ మరియు 1990 లో పద్మ విభూషణ్ తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన మరియు ఆధునీకరణకు చేసిన కృషికి 1997 లో కలామ్ భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారత్ రత్నాను అందుకున్నారు.2013 లో "అంతరిక్ష-సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు" అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నారు. కలామ్ మరణం తరువాత అనేక నివాళులు అందుకున్నారు. ఆయన పుట్టిన రోజైన అక్టోబరు 15 ను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం "యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం" గా జరుపుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం "డాక్టర్ ఎ. పి. జె. అబ్దుల్ కలామ్ పురస్కారం"ను ఏర్పాటు చేసింది. ఇందులో 8 గ్రాముల బంగారు పతకం, ప్రశంసాపత్రం, ₹5,00,000 నగదు బహూకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట్రప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తోంది.
కలామ్ పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా, 2015 అక్టోబరు 15 న ప్రధాని నరేంద్ర మోడీ, న్యూఢిల్లీలోని డిఆర్‌డిఓ భవన్‌లో కలామ్ జ్ఞాపకార్థం తపాలా బిళ్ళలను విడుదల చేశారు.నాసా వారి జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ జెపిఎల్) పరిశోధకులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఫిల్టర్లలో కనుగొన్న కొత్త బాక్టీరియంకు కలామ్ గౌరవార్థం 'సోలిబాసిల్లస్ కలామీ' అని పేరు పెట్టారు. మరణానికి ఒక వారం ముందు బిజ్నోర్‌లో కలామ్ రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలామ్ 2015 జూలై 27 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌ లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలామ్ హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలామ్ ను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలామ్ కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జాతీయ స్మారక చిహ్నాన్ని కలామ్ జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీప పట్టణంలోని పేయ్‌కరుంబు గ్రామంలో డిఆర్డిఓ నిర్మించింది. దీనిని జూలై 2017 లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కలామ్ పనిచేసిన రాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ జన నాయకుని జీవితాన్ని వివరించే వందలాది చిత్రాలతో పాటు అతని జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్స్ (Acrylic paintings) కూడా ప్రదర్శించబడుతున్నాయి. ప్రవేశద్వారం వద్ద కలామ్ విగ్రహం ఉంది. కూర్చుని, నిలబడి ఉన్న భంగిమలో కలామ్గారి మరో రెండు చిన్న విగ్రహాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments