Ad Code

ప్రాణాలు కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్

 

ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మోటార్ సైకిలిస్ట్‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. ఆ స్మార్ట్ వాచ్ ఇచ్చిన సమాచారంతో సమయానికి అతన్ని ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగపూర్‌లోని ఆంగ్ మో కియో ప్రాంతంలో మహ్మద్ ఫిత్రి (24) అనే మోటార్ సైకిలిస్ట్ రోడ్డుపై వెళ్తుండగా ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫిత్రి ఎగిరి చెట్ల పొదల్లో పడిపోయాడు.  అయితే, ఫిత్రి యాపిల్ సిరీస్ 5 స్మార్ట్ వాచ్‌ను ధరించాడు. ఇందులో అత్యాధునిక ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఉంది. అది ధరించిన వారు.. ఏదైనా ప్రమాదానికి గురైతే వెంటనే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కి సమాచారం అందిస్తుంది. ఫిత్రి కిందపోవడాన్ని యాపిల్ వాచ్ గుర్తించింది. మొదట హార్డ్ ఫాల్ వార్నింగ్‌కు ఫిత్రి నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో వాచ్ అలర్ట్ అయ్యింది. అప్పటికే ఆ స్మార్ట్ వాచ్‌లో ఫీడ్ చేసిన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కి, అత్యవసర సేవల నెంబర్లకు సందేశం పంపింది. వెంటనే అలర్ట్ అయిన ఆ దేశ భద్రతా సిబ్బంది.. ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో నిర్మానుష్య ప్రాంతంలో పడి ఉన్న ఫిత్రిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu