Ad Code

నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్‌ కాటన్‌

 


ఓడలు ప్రమాదానికి గురైన సందర్భాల్లో వాటిలో రవాణా చేసే చమురు సముద్రం పాలవడం మనం చూస్తుంటాం. ఈ చమురు సముద్రంలో కాలుష్యాన్ని వెదజల్లి జలచరాలను నాశనం చేస్తుందని పర్యావరణ వేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీరి భయాలను పటాపంచలు చేస్తూ ఐఐటీ గువాహటి పరిశోధకులు వినూత్న అబ్జార్బర్‌ను కనిపెట్టారు. దీని ద్వారా భవిష్యత్‌లో సముద్రంలో ఒలికే చమురును తేలికగా వేరు చేయవచ్చునని అభయమిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఇటీవలి అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ప్రముఖ పీర్-రివ్యూ జర్నల్ 'ఏసీఎస్‌ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్‌ఫేస్‌' లో ప్రచురితమైంది. నీటిని కాకుండా కేవలం నూనెను మాత్రమే పీల్చుకునే వినూత్న హైడ్రోఫోబిక్ కాటన్ కాంపోజిట్‌ను ఐఐటీ గువాహటి పరిశోధకులు సృష్టించారు. భవిష్యత్‌లో చమురు చిందటం వంటి పర్యావరణ సంక్షోభ పరిస్థితులను పరిష్కరించడానికి దీనిని ఉపయోగించవచ్చు. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (ఎంఓఎఫ్‌) కలిగిన అత్యంత పోరస్, నీటిని వికర్షించే సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్ కాంపోజిట్ మెటీరియల్.. చమురు-నీటి మిశ్రమం నుంచి చమురును వేరుచేస్తుంది. ఈ కాటన్‌ అబ్జార్బర్‌.. చమురు రవాణా సమయంలో సముద్రంలో ఒలికిపోయిని చమురును ఒద్దికగా నీటి నుంచి వేరుచేసేందుకు అవకాశాలు ఉన్నాయని పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్‌ శ్యాం పీ బిశ్వాస్‌ చెప్పారు. రసాయనాలు, నూనె సాంద్రతతో సంబంధం లేకుండా విభజన సామర్థ్యం 95-98 శాతం మధ్య ఉంటుందని తెలిపారు. ఈ కాటన్‌ అబ్జార్బర్‌ను కనీసం 10 సార్లు తిరిగి వాడేందుకు వీలుంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వస్తే సముద్రాల్లో పడిపోయి తెట్టుగా మారిన నూనెను తేలికగా బయటకు తీసి పర్యావరణాన్ని కాపాడవచ్చునని అభయమిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu