Ad Code

పండ్ల వ్యర్థాల నుంచి బ్యాండేజీ

 

పండ్ల వ్యర్థాలతో యాంటీ బాక్టీరియల్ బ్యాండేజ్‌ను సిద్ధం చేశారు సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు. ఈ బ్యాండేజ్‌ గాయం వేగంగా నయం కావడానికి, చల్లగా, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు డూరియాన్ పండు వ్యర్థాల నుంచి ఈ బ్యాండేజ్‌ను తయారు చేసినట్లు వెల్లడించారు. డూరియన్ పండు తొక్కను ఎవాపరేషన్‌ ప్రక్రియలో వేరు చేసి.. గ్రైండింగ్ చేసి సెల్యులోజ్ పౌడర్ సిద్ధం చేస్తారు. ఈ పొడిలో గ్లిసరాల్‌ను కలుపడం ద్వారా యాంటీ బాక్టీరియల్ స్ట్రిప్స్‌గా మార్చవచ్చునని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు నిరూపించారు. ఇది సన్నని స్ట్రిప్స్‌గా కట్ చేసి పట్టీలుగా గాయాలు మానేందుకు వాడుకోవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు. ఈ కట్టు మృదువైన హైడ్రోజెల్‌గా పనిచేస్తుంది. ఇతర పట్టీల కంటే ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. గాయం కూడా త్వరగా నయమవుతుంది. డూరియన్‌ పండ్లలోని గుజ్జు ద్వారా కొత్త రకం బ్యాండేజ్‌లు తయారుచేయడం చౌక అని కూడా పరిశోధకులు అంటున్నారు. అచ్చం పనస పండు మాదిరిగా ఉండే ఈ డూరియన్లను సింగపూర్ ప్రజలు ఏటా 12.5 కోట్ల వరకు తింటుంటారు. గుజ్జును మాత్రమే తిని మిగతాది వ్యర్థ పదార్థంగా పడేస్తుంటారు. ఇది పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మలేషియా, థాయిలాండ్‌, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌లో మాత్రమే పండే వీటిలో సీ-విటమిన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, బీ-6 విటమిన్‌, ఏ-విటమిన్‌, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండు గుజ్జును ఉపయోగించి బ్యాండేజీని తయారు చేయడం ద్వారా వ్యర్థాలు లేకుండా చూసి పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చునంటున్నారు పరిశోధకులు. వీటిని కింగ్స్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌ అని పిలుస్తుంటారు.

Post a Comment

0 Comments

Close Menu