Ad Code

బంగారు దీవి

  

ఇండోనేషియా సుమత్రా దీవుల్లో పాలెంబాంగ్‌ నగరంలో మూసీ అనే నది ప్రవహిస్తున్నది. ఈ నది అడుగుభాగంలోనే ఈ బంగారు దీవిని స్థానిక మత్స్యకారులు గుర్తించారు. ఈ దీవి శ్రీవిజయ నాగరికతకు చెందినదిగా అంచనా వేస్తున్నారు. శ్రీవిజయ దీవిలో.. బంగారం, నగలు, విలువైన రత్నాలు, పగడాలు, బంగారు నాణెలు, బంగారు ఉత్సవ ఉంగరాలు, కాంస్య గంటలు, రత్నాలతో అలంకరించిన బుద్ధుని విగ్రహం, రాహువు శిరస్సు విగ్రహం తదితరాలు దొరికాయి. దీని విలువ లక్షల కోట్లు ఉంటుందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. వీటిలో కొన్ని వస్తువులు, కళాఖండాలు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నవిగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఆగ్నేయాసియాలో అత్యంత శక్తివంతమైన రాజ్యమే శ్రీవిజయ సామ్రాజ్యం. క్రీస్తు శకం 7 నుంచి 13వ శతాబ్దం వరకు శ్రీ విజయ సామ్రాజ్యం ఎంతో వైభవంతో విలసిల్లింది. రాజు నివసించే మందిరం, దేవాలయాలను మాత్రమే నేలపై నిర్మించారు. మిగతా రాజ్యం, కోట, ఇండ్లు, వ్యాపార సముదాయాలను నది నీటిపై చెక్క పడవలను పరిచి వాటిపై నిర్మించారు. అందుకే దాన్ని 'వాటర్‌ వరల్డ్‌'గా కూడా పిలుస్తారు. 'బంగారు దీవి' గురించి తాత ముత్తాతలు చెప్పిన కథలు.. శిథిలమైన దేవాలయాల్లో కొన్ని ఆనవాళ్లను గుర్తించిన స్థానిక మత్స్యకార యువకులు ఎలాగైనా శ్రీవిజయ నిధిని బయటకు తేవాలని దృఢ నిశ్చయానికి వచ్చారు. మూసీ నదిలో ఇబ్బడిముబ్బడిగా ఉండే మొసళ్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ అన్వేషణ సాగించారు. ఎట్టకేలకు నది అడుగున ఉన్న పురాతన నగరానికి చేరుకున్నారు. అక్కడ మట్టిదిబ్బలను తొలగించగా మిలమిల మెరుస్తూ కనిపించిన బంగారు నిధిని చూసి ఆశ్చర్యానందానికి లోనయ్యారు. అలా వారి ఐదేండ్ల శ్రమ ఫలించింది. శ్రీవిజయ సామ్రాజ్యం ఎలా మాయమైపోయిందన్నదానికి కచ్చితమైన ఆధారాలు ఇప్పటికీ లేవు. ఇండోనేషియా దీవుల్లో అగ్నిపర్వతాలు ఎక్కువ. వాటి విస్ఫోటనం వల్ల గానీ లేదా మూసీ నది ఉప్పొంగడం వల్ల గానీ ఈ నగరం మునిగిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu