Ad Code

తెనాలి రామకృష్ణ

 



ఒకసారి కృష్ణ దేవరాయల  ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. అతను సంస్కృతం లోనన్ను ఓడించగలిగే వారు లేరు. మీ ఆస్థానం లో వున్నారేమో పరీక్షిద్దామని  నేను వచ్చాను అని సవాలు చేశాడు. రాయలవారు ఆ పండితుడికి తుంగభద్రానదీ తీరం లోని అతిథి గృహం లో బస ఏర్పాటు చేశారు. ఆయన మరుదినం సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆస్థానం లోని సంస్కృత పండితులు పని మీద వేరే దేశానికి వెళ్లి పోయారు. ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడం ఎలా అని మిగతా కవులు ఆలోచనలో  పడ్డారు.వాళ్ళంతా తెనాలి రామకృష్ణుడి దగ్గరకు వెళ్లి ఈ గండాన్ని ఎలాగైనా గట్టెక్కించమని ప్రాధేయ పడ్డారు. మరుసటి దినం ప్రొద్దున రామకృష్ణుడు చాకలి వాడి వేషం వేసుకొని తన భార్యకు చాకిత వేషం వేసి నది దగ్గరకు వచ్చి ఏమి చెయ్యాలో చెప్పాడు. ఉదయం .ఆ పండితుడు నది దగరకు వచ్చి స్నానం చేస్తున్నాడు. అక్కడికి దగ్గరలోనే రామకృష్ణుడు చాకలి వేషంలో బట్టలు వుతుకుతున్నాడు. ఇంతలో చాకిత వేషంలో వున్నఅతని భార్య వచ్చింది అన్నం లోకి కూరేమి చెయ్యమంటావు మామా? అని అడిగింది. అప్పుడు రామకృష్ణుడు;

"మత్కుణం నది సంయుక్తం విచార ఫలమేవచ 

గోపత్నీ సమాయుక్తం గ్రామ చూర్ణంచ వ్యంజనం"  

అని ఆ పండితుడికి వినపడేలా గట్టిగా  చెప్పాడు. భార్య కూడా అలాగే అని తల ఊపి వెళ్లి పోయింది.నదీతీరంలో సంధ్య వార్చుకుంటున్నపండితుడు  ఆ సంభాషణ విన్నాడు. అతనికి ఒక్క ముక్కకూడా అర్థం కాలేదు. మత్కుణం నది సంయుక్తం యిదేమిటి? విచార ఫల మేమిటి? గోపత్ని,గ్రామచూర్ణం యివన్నీ ఏమిటి? తల తిరిగి పోయిందతడికి. ఇక్కడ  చాకలివాడికీ వాడి భార్యకీ వచ్చిన సంస్కృతం తన కర్థం కాలేదే మరి తను రాయల ఆస్థానం లోని పండితుల నెలా ఓడించగలడు? అనుకోని తన బసకు వెళ్లి మూటా ముల్లె సర్దుకొని ఊరొదిలి పారిపోయాడు.. చారులవల్ల సంగతి తెలుసుకొని పండితులంతా రామకృష్ణుడి దగ్గరకు వెళ్లి అభినందనలు చెప్పి ఏమి  చేశావని అడిగారు. అంతా చెప్పేసరికి వాళ్ళు ఆ శ్లోకం తమకూ ఏమీ అర్థం కావటం లేదన్నారు. అప్పుడు రామకృష్ణుడు యిలా వివరించాడు. మత్కుణం అంటే నల్లి. నల్లి+యేరు= నల్లేరు, విచారఫలం అంటే చింతపండు. గోపత్ని అంటే ఆవు+ఆలు=ఆవాలు గ్రామ చూర్ణం అంటే వూరుబిండి. అంటే పచ్చడి. (రాయలసీమలో పచ్చడిని ఊరుబిండి అని అంటారు) నల్లేరు, చింతపండు, ఆవాలు వేసి పచ్చడి చెయ్యమని చెప్పాను. దెబ్బకు గురుడు పారి పోయాడు. అది విని అందరూ  పెద్దగా నవ్వారు. రామకృష్ణుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. 

 

Post a Comment

0 Comments

Close Menu