Ad Code

అలిగిన తాత...!

 

ఒక వూరిలో వృద్ధ దంపతులు వుండేవారు. వారిద్దరికీ బ్రహ్మ చెవుడు. తాతగారికేమో ప్రతి చిన్నదానికీ కోపం వచ్చేది. ఎప్పుడూ అలిగేవారు. ఒకసారి తాత అవ్వతో యివ్వాళ తియ్యని గొజ్జు (పులుసు) చేసి కందిపప్పు తియ్య పచ్చడి చెయ్యి అని చెప్పాడు. ఆవిడకు పూర్తిగా వినపడలేదు. అందుకని ఆవిడ పులుసు పుల్లగా చేసి పచ్చడి కారంగా చేసింది. తాత వచ్చి కంచం ముందు కూర్చుని ముద్ద నోట్లో పెట్టుకుంటే పుల్లగా వుంది. వెంటనే కోపంతో నా మాటంటే నీకు లెక్కలేదు. పుల్లగా తగిలేశావు  ఎలా తినాలనుకున్నావు అని గట్టిగా అరుస్తూ కంచం అవ్వ మీదకు విసిరి బయటికి వెళ్ళిపోయాడు. అవ్వ పాపం అయ్యో నాకు వినపడక యిలా చేసానే అని బాధ  పడి అక్కడంతా శుభ్రం చేసి మరీ స్నానం చేసి తియ్య పులుసు చేసి తియ్య పచ్చడి చేసి ముసలాయన పాపం ఆకలితో వెళ్లి పోయాడే అని బాధ పడుతూ తాత కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తాత కోపంగా వెళ్లి ఊరిబయట దేవాలయం లో చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడికి ఒక గొల్లవాడు వచ్చాడు. వాడికీ చెవుడే. వాడి ఆవూ, దూడఎక్కడో తప్పిపోయాయి.తాత గారిని  చూసి అయ్యగారిని నా ఆవూ దూడ ఎక్కడికి పోయాయో ప్రశ్న అడుగుదాము అనుకోని, దగ్గరకు వెళ్లి స్వామీ! నా ఆవు, దూడ ఎక్కడో తప్పిపోయాయి. ఎక్కడ దొరుకుతాయో  ప్రశ్నచెప్పండి  అని తాతను అడిగాడు. తాతకు విని పించలేదు. మరీ దగ్గరగా వెళ్లి అడిగాడు. తాత కు ఆకలివేస్తున్నది ఎండ కూడా తీవ్రంగా వుంది. వాడు మరీ దగ్గరకు వచ్చి ఏదో అనేసరికి మరీ కోపం వచ్చి చెయ్యి జాచి  పోరా పో అనికసిరాడు. వాడికీ చెవుడే కదా! ఆయన చెయ్యి చూపించిన వైపు వెళ్ళ మంటూ ఉన్నాడని అటు వైపు వెళ్ళాడు. కొంచెం దూరం పోగానే అక్కడ వాడి ఆవు దూడ మేస్తూ కన పడ్డాయి. వాడు సంతోషంతో అయ్యగారు భలే సరిగ్గా ప్రశ్న చెప్పారు అనుకోని ఆయన దగ్గరికి వచ్చి అయ్యగారూ నా ఆవూ దూడా దొరికాయి. నా దగ్గర మీకు యివ్వడానికి డబ్బు లేదు. ఈ దూడను మీరే ఉంచుకోండి అని చెప్పాడు. తాత కు వినిపిస్తే కదా! వూరికే ఏదో గొణుగుతూ కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి యింకో తెలివైన గొల్లవాడు వచ్చాడు. వాడు వీళ్ళిద్దరికీ చెవుడు ఉన్నట్టుంది అని గ్రహించి గొల్లవాడిని దూరంగా తీసుకొని పోయి గట్టిగా యిలా చెప్పాడు. ఈయనకు ఆవూ దూడా రెండూ కావాలట. నీవు ఆవును తోలుకొని యింటికి వెళ్ళు నేను ఎలాగయినా ఆయనను ఒప్పించి దూడను తీసుకునేట్టు చేస్తాను అని వాడిని అక్కడినుండి పంపించి వేశాడు. తర్వాత తాత దగ్గరికి వచ్చి గట్టిగా నీవు వాడి ఆవూ దూడలను దొంగిలించా వట. వాడు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్ళాడు. నీవు కాసేపు యిక్కడే ఉన్నావంటే పోలీసులు నిన్ను తీసుకొని పోయి జైల్లో వేస్తారు. నీవు త్వరగా యింటికి వెళ్ళిపో అని చెప్పాడు. పోలీసులనేసరికి తాత భయపడి పోయి వేగంగా నడుచుకుంటూ యింటికి వెళ్ళాడు. ఆ తెలివైన గొల్లవాడు దూడను తీసుకొని ఆనందంగా యింటికి వెళ్లి పోయాడు. పాపం అవ్వ తాత కోసం ఎదురు చూస్తూ గుమ్మం లోనే కూర్చుని వుంది. తాతను చూడగానే సంతోషం తో కాళ్ళకు నీళ్ళు యిచ్చి లోపలి తీసుకొని పోయి కంచం పెట్టి తియ్య గొజ్జు, తియ్య పచ్చడి వడ్డించింది.తృప్తిగా తిని తాత గుర్రు పెడుతూ నిద్ర పోయాడు. యిద్దరికీ చెవుడయితే మూడో వాడు లాభ పడ్డాడు.


Post a Comment

0 Comments

Close Menu