Ad Code

పద్మశ్రీ హరేకల హజబ్బా

 



తెల్లటి ధోవతీ, చొక్కా, మెడలో కండువా, కాళ్లకు చెప్పులు కూడా లేని ఈ 68 ఏళ్ల వ్యక్తి పేరు హరేకల హజబ్బా. మంగళూరు వీధుల్లో పండ్లు అమ్ముకునే ఈయన.. నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హజబ్బా ప్రత్యేకంగా నిలిచారు. ఆర్థికంగా నిరుపేద వ్యక్తి అయిన హజబ్బా.. సాయంలో మాత్రం నిజమైన శ్రీమంతుడు. చదువుకోని వారికే అక్షరం విలువ తెలుస్తుంది అంటారు. ఆ విలువ తెలిసిన వాడు కాబట్టే ఎంతో మందికి అక్షరదానం చేస్తున్నారు. పండ్లు అమ్మితే వచ్చే కొద్దో గొప్పో సంపాదనతోనే పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తికి నిలిచారు. అందుకే పద్మశ్రీ అంతటి గొప్ప పురస్కారం ఆయన్ను వరించింది. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగుళూరు తాలుకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా నిరక్షరాస్యుడు. స్థానికంగా బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఒకసారి ఓ విదేశీ జంట హజబ్బా వద్దకు వచ్చి ఆంగ్లంలో పండ్ల ధర ఎంత అని అడిగారు. ఆయనకు ఇంగ్లీష్‌ రాదు దీంతో కన్నడలో సమాధానం చెప్పారు. అది వారికి ఎంతకీ అర్థం కాకపోవడంతో ఆ జంట విసుగుపుట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటనతో హజబ్బా ఎంతగానో కుమిలిపోయారు. తాను చదువుకొని ఉంటే ఇలా జరిగే ఉండేది కాదు కదా అని బాధపడ్డారు. ఆ క్షణమే ఆయనలో ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకోకపోతేనేం.. తనలా మరెవరూ అలా బాధపడొద్దని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తాను సంపాదించేదాంట్లో కొంత కూడబెట్టడం మొదలుపెట్టారు. అలా ఆయన 2000 సంవత్సరంలో కొంతమంది పేద విద్యార్థులతో స్థానికంగా ఉన్న మదర్సాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో పాఠశాల నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం తన సంపాదనలో దాచుకున్న సొమ్ముతో పాఠశాల నిర్మాణానికి కావలసిన ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇతర దాతలు నుంచి విరాళాలు సేకరించి, ప్రభుత్వ అధికారుల సహాయంతో న్యూపడపు గ్రామంలో పాఠశాల నిర్మించారు. ఇప్పటికీ రోజూ ఆ పాఠశాల ఆవరణను హజబ్బా శుభ్రం చేస్తారు. విద్యార్థుల కోసం వేడినీటి వసతిని కూడా కల్పించారు.

Post a Comment

0 Comments

Close Menu