Header Ads Widget

"పునరుజ్జీవం"


లియో టాల్‌స్టోయ్ రచనల్లో "పునరుజ్జీవం" అనే నవల మనలోని చాలా ఆలోచనలను పటాపంచలు చేస్తుంది. మనకు నడుస్తున్న గొప్పదనుకుంటున్న సాహిత్యంపై మనకున్న భ్రమలన్నీ ఈ ఒక్క కధతో పటాపంచలై పోతాయి..ఈ నవల చదవక మునుపు నేను చాలా దేశీయా..విదేశీ సాహిత్యాన్ని తెలుగీకరించి తమదని చెప్పుకుంటూ కొన్ని భ్రమలను పుట్టించిన మేధావుల రచనలను చాలానే చదివాను..ఇంకా చెప్పాలంటే ఆ చదివిన భ్రమల్లో అదే త్యాగమేమో, గొప్పనేనో అనుకునే వాడిని,ఊహల్లో ఊరేగేవాడిని కూడా.. కానీ నా తొమ్మిదో తరగతిలో అనుకుంటా,నాకు దొరికిన ఈ "పునరుజీవం" పుస్తకం, నే చదువుతున్న సాహిత్యం పట్లా..సమాజానికి ఆ సాహిత్యం ఇస్తున్న సందేశాల పట్లా, ఉన్న అభిప్రాయాల్లో చాల మార్పు తెచ్చింది..ఇప్పుడు నేను వ్యక్తపర్చే ఈ నా చాలా భావాల వెనుక ఈలాంటి పుస్తకాలు చదివిన జ్ఞానం..అబ్బిన అభిప్రాయాలూ ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలను.

ఇక కధను క్లుప్తీకరించి చెబుతా..

లియో టాల్‌స్టోయ్ గొప్ప కధకుడు..తాను చెప్పే కధనంలో పాత్రలు మన కళ్లముందే కదులుతున్నట్లుంటుంది..మనతో తమ తమ సొదలు చెప్పుకుని రోధిస్తున్నట్టుంటుంది..మనతో, కాదు కాదు..మన మనస్సుతో పోట్లాటకు దిగే చాలా పాత్రలు మనని మెలకువలోకి లాక్కొచ్చి పడేస్తాయి..తర్కాన్ని మెదడులోకి దిమ్మరించి..మనం ఏ మేడ మిద్దెల్లో ఉన్నా..గుడిసెల్లో నేలపై దొర్లుతున్నా ఒక చైతన్యాన్ని మనపైకి వెదజల్లి పోతాయి. ఇక్కడ,ఈ కధలో ఒక కడు చక్కని అందగత్తెగా ఒక కన్య జీవితం మనకు కనిపిస్తుంది..ఆమె ఓ పనిమనిషిగా కొనసాగించడం.. సమాజంలో ఉన్న పేదరికాన్ని మన ముందు బళ్లున దొర్లించినట్టు.. ఆ అగచాట్లను ఏకరువు పెడుతుంది ఈ కధ.అయితే ఆ అందానికి, ఆకర్షణకూ లొంగిపొయ్యి..ఓ జమిందారీ యువకుడు ఆమెను మోహిస్తాడు. మాయమాటల్లో..సంపదల చాటు కుయుక్తులతో.. లోబర్చుకుని ఆమెను గర్భవతిని చేస్తాడు..చివరికి గాలికి వదిలేసి మాయమవుతాడు. ఇక సంఘం తన పాత్రను చక్కగా పోషిస్తుంది, సన్నిహితులా, బందువుల సూటిపోటి మాటలూ..చీత్కారాలతో విసిగిన ఆ యువతి ఏ ఆశ్రయమూ లేక..ఆమెపై అనుమానంతో ఎవరూ పనిలోకి సైతం తీసుకోక..అప్పటి సంఘ నియమాలు ఎత్తి చూపిన దోషానికి బలై ఏ దిక్కూ తోచక ఆమె ఒక  వ్యభిచారిగా మారాల్చి వస్తుంది.చివరికి దొంగతనంలో దోషిగా దొరికి..న్యాయస్తానానికి ఈడ్వబడుతుంది.

కధ ముగింపు దశలో ఆమెకు, ఆమె చేసిన నేరాలకు కఠిన శిక్ష విధించాలని కోర్టుకు ఆమె నివేధించబడుతుంది. ఆమెను ఒక ఉన్నత జ్యూరీ కమిటీ విచారణకు తీసుకుంటుంది.ఆ ఉన్నత జ్యూరీలో ఆమెను అనుభవించీ..గర్భవతిని చేసి గాలికి వదిలేసిపోయిన ఆ జమీందారీ యువకుడు కూడా సభ్యుడుగా ఉంటాడు. ఆమె అప్పటి దీనావస్తకి తాను కారణమని గ్రహించిన ఆ జమీందారీ యువకుడు పశ్చాత్తాపం చెందుతాడు..ప్రాయ చిత్తంగా ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెబుతాడు..అప్పటికి ఆమె మౌనంగా ఉండిపోతుంది..చివరికి శిక్షను అనుభవించడానికి సైబీరియాకు పంపబడుతుంది..ఆ జమిందారీ యువకుడు కూడా ఆమెతో పాటు సైబీరియాకు వెళ్లి ఆమెను బతి మాలి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.. ఇక్కడే లియో టాల్‌స్టోయ్ సమాజానికి గొప్ప సందేశాన్ని మనకు మింగుడు పడనీ..మన సమాజపు మూసధోరణి ముగింపుల సందేశాలు పెళ్లున పేలిపోయేలా ఇస్తాడు..చర్నాకోలా దెబ్బలా చళ్లుమనిపిస్తాడు. అక్కడ ఆమె చెబుతుంది కదా.. నా జీవితం మొత్తం ధ్వంసం అయిపోయింది..ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే దానికి ఏలాంటి గౌరవ స్థానం రాదు..పైగా ఇలాంటి చెడిపోయిన పిల్లను చేసుకున్నందుకు, ఏ జమీందారీ యువకుడి కారణంగా ఈ పాపానికి ఈడ్చబడ్డానో..అతడే పుణ్యాత్ముడైపోతాడు.."అతన్ని పుణ్యాత్ముడిని చెయ్యడం నాకు ఇష్టం లేదని" అతని ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. ఇలాంటి ముగింపులను మన భారతీయ సాహిత్యంలో ఊహకు గూడా చదవలేము కదా..? కాదా..? ఇంకా వర్గ దృక్పదం వేధనలనుభవిస్తున్న వ్యక్తుల్లో పుడుతుంది..అది సమాజమూ, వ్యక్తులు జీవిస్తున్న పరిసరాలూ సృష్టించే సాహిత్యాల ద్వారా నిర్మాణం అవుతుంది.

Post a Comment

0 Comments