Ad Code

ప్రత్యేక రైళ్లు ముద్ర తొలగింపు !

 

'ప్రత్యేక రైళ్లు' అనే ముద్ర ఇకపై తొలగిపోనుంది. ఆ పేరుతో వసూలు చేసే ప్రత్యేక ఛార్జీలకు కూడా రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనాకు ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, వాటి ఛార్జీలు ఉండనున్నాయి. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ దగ్గర నుంచి రైల్వే శాఖ కేవలం 'స్పెషల్‌ ట్రైన్స్‌'ను మాత్రమే నడుపుతోంది. అనవసర ప్రయాణాలను నిరుత్సాహ పరచాలన్న ఉద్దేశంతో ఛార్జీలను పెంచింది కూడా. తొలుత దూర ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య కూడా నడపడాన్ని ప్రారంభించింది. పాతవాటినే ప్రత్యేక రైళ్లుగా నడుపుతూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, నెంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ రైల్వే బోర్డు అన్ని జోనల్‌ కార్యాలయాలకు లేఖలు రాసింది. అన్ని రైళ్లు పట్టాలు ఎక్కడానికి ఒకటి రెండు రోజులు పడుతుందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రత్యేక రైలు నెంబరుకు మొదట 'సున్నా' ఉంటుందని, ఇకపై అది ఉండబోదని తెలిపారు. అయితే కరోనా కారణంగా రాయితీలు, బెడ్‌ రోల్స్‌, భోజనాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పారు. 

Post a Comment

0 Comments

Close Menu