Ad Code

అద్భుతాలు సృష్టిస్తున్న 3డీ ప్రింటింగ్‌


త్రీడీ ప్రింటింగ్‌తో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. త్రీడీ గుండెల దగ్గర నుంచి రక్తనాళాల వరకూ దేన్నయినా తయారు చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణమూ జరుగుతున్నది. తాజాగా మినియేచర్‌ కళ కూడా తోడైంది. ఫ్యామిలీ ఫొటోలు, ప్రేమికుల రూపాలు, దివంగతుల ఛాయా చిత్రాలు కూడా ఫుల్‌బాడీ త్రీ డైమన్షనల్‌ మినియేచర్‌ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఓ పెద్ద మనిషి తన భార్య నిలువెత్తు బొమ్మను చేయించి పెట్టుకున్నాడు. ఓ పుత్రుడు తల్లిదండ్రుల విగ్రహాలతో ఏకంగా ఓ గుడే కట్టించాడు. ఇక ఫ్యామిలీ ఫొటోలను బొమ్మగా మార్చుకునేవారి సంఖ్యా పెరుగుతున్నది. గతంలో అయితే ఇదంతా ఖరీదైన వ్యవహారం. త్రీడీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. నిమిషాల పని. చాలా సంస్థలు ఆన్‌లైన్‌లోనూ సేవలు అందిస్తున్నాయి. ఫొటో అప్‌లోడ్‌ చేసి.. చెల్లింపు జరిపితే చాలు. నిర్ణీత సమయానికి కొరియర్‌లో బొమ్మలు వచ్చేస్తాయి. ప్రేమికుల దినోత్సవం రోజే స్వాతి పుట్టినరోజు. దీంతో అదిరిపోయే గిప్ట్‌ ఇవ్వాలనుకున్నాడు భర్త సుందర్‌. పెండ్లి ఫొటోను మినియేచర్‌ ఆర్ట్‌ రూపంలో అందించి ఆశ్చర్యానందాలకు గురిచేశాడు. దివంగతుల ఫొటోలకు కూడా చాలామంది ఓ రూపం ఇస్తున్నారు. దీంతో ఏ లోకాల్లోనో ఉన్న ఆ పెద్దలు షోకేస్‌లో ప్రత్యక్షమై తమను ఆశీర్వదిస్తున్న భావన కలుగుతుంది. ఏ పోలీస్‌ సర్వీస్‌ నుంచో రిటైర్‌ అవుతున్నవారికి యూనిఫామ్‌లో ఉన్నప్పటి బొమ్మను ఇస్తే.. అంతకుమించిన ఆనందం ఏం ఉంటుంది? ఇంకొంతమంది అయితే, సృజనాత్మకత జోడించి వాటికే క్యారికేచర్‌ ఎఫెక్ట్‌ ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ కుటుంబంలో భాగమైన పెంపుడు జంతువుల జ్ఞాపకార్థం కూడా త్రీడీ రూపాలను తీయిస్తున్నారు. మినియేచర్‌ బొమ్మల ధరలు మధ్యతరగతికి దగ్గరలోనే ఉన్నాయి. రూ.2 వేలతో మొదలై.. బొమ్మ పరిమాణాన్ని బట్టి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. వీటిని సాండ్‌స్టోన్‌తో కానీ, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో కానీ రూపొందిస్తారు. ఈ ట్రెండ్‌ ఇంకొంత విస్తరించి.. గృహ ప్రవేశాలైతే ఆ ఇంటి త్రీడీ నమూనాను, నామకరణోత్సవం అయితే పసిబిడ్డ బొమ్మను కూడా కానుకగా ఇస్తున్నారు. ఎవరి రూపం వారికి ముద్దు. కాబట్టి, షోకేస్‌కు ఎక్కడం ఖాయం. 

Post a Comment

0 Comments

Close Menu