Ad Code

మానవ హృదయ కణాలతో కృత్రిమ చేప!


అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ చేపను తయారు చేసి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. ఈ ఆర్టిఫిషియల్‌ చేపకు ఈదడానికి కావాల్సిన శక్తిని మానవ హృదయ కణాల ద్వారా అందించడం విశేషం. హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం, ఎమోరీ యూనివర్సిటీ సహాకారంతో ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. ఈ కృత్రిమ చేపను రూపొందించడానికి శాస్త్రవేత్తలు, కాగితం, ప్లాస్టిక్‌, జెలటిన్‌తో పాటు మానవుడి హృదయ కండరాల నుంచి సజీవంగా ఉన్న కణాలను ఉపయోగించారు. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో హృదయ సంబంధిత వ్యాధుల పరిశోధనల్లో ఎన్నో అద్భుత మార్పులు రానున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో కృత్రిమ హృదయాలను రూపొందించడానికి ఈ ఫలితాలు సహకరిస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధనలకు సంబంధించి ఫలితాలను పరిశోధకులు గత వారం జర్నల్‌ సైన్స్‌ మేగజైన్‌లో ప్రచురించారు. ఇదిలా ఉంటే హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కృత్రిమ చేప ఈత కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఇలాంటి ప్రయోగాన్ని చేయడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ 2016లో కృత్రిమ స్ట్రింగ్రే (సముద్రపు జీవి)ను రూపొందించారు. ఇందుకోసం పరిశోధకులు ఎలుక గుండె నుంచి కణాలను సేకరించారు. ఈ ఎలుక గుండె కణాలపై కాంతిపడగానే అవి సంకోచించాయి. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ హృదయం అందుబాటులోకి రావాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu