Ad Code

రూ.1.45 లక్షలకే బ్యాటరీ కారు


హర్యానా రాష్ట్రానికి చెందిన గ్రీన్ మాస్టర్స్ అనే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. చాలా సింపుల్‌గా కనిపించే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అంతే సింపుల్ ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిని రోడ్లపై నడపడానికి రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటివి అవసరం లేదు. వీటి గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు మాత్రమే. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనాలను హైవేపై నడపటానికి అనుమతి లేదు. కేవలం సిటీ రోడ్లపై అర్బన్/రూరల్ రోడ్లపై వినియోగించుకోవచ్చు. గ్రీన్ మాస్టర్స్ ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీలో మనకు బాగా పరిచయం ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌ సైకిళ్లలో వాడే అనేక భాగాలను ఉపయోగించారు. ఈ కారు యొక్క తాళం చెవి, సైడ్ మిర్రర్స్, వీల్స్ వంటి వాటిని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌ సైకిళ్లలో కూడా మనం గమనించవచ్చు. అలాగే, డ్రైవ్‌ట్రైన్ లోని కొన్ని కీలక భాగాలను ఆల్టో కార్లలో ఉపయోగించే పరికరాల నుండి సేకరించారు. కాబట్టి, కారును కొన్న తర్వాత విడిభాగాలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా చింతించాల్సిన అవసరం లేదు. గ్రీన్ మాస్టర్స్ అందిస్తున్న ఈ క్లాసిక్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.1.45 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. వీటికి రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటివి అవసరం లేవు కాబట్టి, కస్టమర్లు జిఎస్‌టి మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అయితే, షిప్పింగ్ చార్జీలు అదనంగా ఉంటాయి. ఖచ్చితమైన షిప్పింగ్ చార్జీల కోసం కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. ఇందులోని బేస్ మోడల్ 2-సీటర్ వేరియంట్ రూపంలో వస్తుంది. ఇది మెరూన్ మరియు గ్రే కలర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ బేస్ వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 50-60 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని పూర్తిగా చార్జ్ చేయడానికి కనీసం 4-5 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 1 ఏడాది వారంటీని అందిస్తుంది. దీని టాప్-స్పీడ్ గంటకు 40-45 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందులో స్పోక్ వీల్స్ లభిస్తాయి, కానీ స్పేర్ టైర్ లభించదు. ఇది 2.74 మీ పొడవు, 1.37 మీ ఎత్తు, 450 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 200 కేజీల బరువు మరియు 70 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. గ్రీన్ మాస్టర్స్ ఈ 2-సీటర్ మోడల్‌లో ఓ టాప్-ఎండ్ వేరియంట్‌ను కూడా విక్రయిస్తోంది. దీని ధర రూ.2.45 లక్షలుగా ఉంటుంది. పెరిగిన ధరకు తగినట్లుగా ఇందులో అదనపు ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 90-100 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. పెరిగిన రేంజ్‌కు తగినట్లుగా ఇందులో పెద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని చార్జింగ్ సమయం కూడా 4-5 గంటలు పడుతుంది. కాకపోతే, కంపెనీ ఈ బ్యాటరీ ప్యాక్‌పై గరిష్టంగా మూడేళ్ల వారంటీని అందిస్తుంది. ఇది ఆరు రంగులో లభిస్తుంది. గ్రీన్ మాస్టర్స్ తమ వింటేజ్ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఓ 4-సీటర్ మోడల్ ను కూడా అందిస్తుంది. ఇందులో వెనుక భాగంలో స్టోరేజ్ స్పేస్ స్థానంలో రియర్ ఫేసింగ్ బెంచ్ సీట్ ఉంటుంది. ఇది కూడా పూర్తి చార్జ్ పై గరిష్టంగా 90 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అధిక సీటింగ్ సామర్థ్యం కారణంగా, కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌పై గరిష్టంగా మూడేళ్ల వారంటీని అందిస్తుంది. ఇది కూడా ఆరు రంగులో లభిస్తుంది. ఇందులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం లెథరెట్ అప్‌హోలెస్ట్రీతో కూడిన సీట్లు కూడా ఉంటాయి. గ్రీన్ మాస్టర్స్ ప్రోడక్ట్ లైనప్‌లో చివరిది యూటివి మోడల్. చూడటానికి ఆల్-టెర్రైన్ వెహికల్ కనిపించే ఈ ఎలక్ట్రిక్ వాహనం ఓ ఫన్ టూ రైడ్ యూటివిగా ఉంటుంది. దీని ధర 4-సీటర్ వింటేజ్ కారు ధరతో సమానంగా ఉంటుంది. అల్లాయ్ వీల్స్, స్పోర్టీ సీట్లు, డైమండ్ ప్యాటర్న్ సైడ్ మిర్రర్స్, మెటల్ కేజ్ బాడీ వంటి ఫీచర్లు దీని సొంతం. ఇందులో కూడా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. పైన తెలిపిన అన్ని మోడళ్ల టాప్ స్పీడ్ కూడా గరిష్టంగా గంటకు 40-45 కిమీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం గ్రీన్ మాస్టర్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Post a Comment

0 Comments

Close Menu