Header Ads Widget

వచ్చే త్రైమాసికంలో హీరో ఎడ్డీ విడుదల


హీరో మోటార్స్ తమ అనుబంధ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి మరో కొత్త మోడల్ ఈ స్కూటర్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. “హీరో ఎడ్డీ” పేరుతో రానున్న ఈ ఈ-స్కూటర్ వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది సంస్థ. ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల జోరు ఊపుమీదుండగా.. కొత్త సంస్థలు అనేకం పుట్టుకొచ్చి ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే సర్వీస్ లభ్యత, ఛార్జింగ్ సమస్యల దృష్ట్యా వినియోగదారులు కాస్త వెనకడుగేస్తున్నారు. అదే సమయంలో అథెర్, ఓలా, వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసాయి. ఎంతో స్టైలిష్ గా, అధునాతన ఫీచర్లు ఉన్న ఆ వాహనాలను కొనేందుకు వినియోగదారులు ఉత్సాహం కనబరుస్తున్నారు. అదే సమయంలో ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న హీరో ఎలక్ట్రిక్ మాత్రం.. మార్కెటింగ్ పరంగా విఫలమై మూస పద్దతిలోనే వాహనాలను విక్రయిస్తుంది. ఈక్రమంలో అథెర్, ఓలా వంటి సంస్థలతో పాటు ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు పోటీ ఇచ్చేలా అల్ట్రా స్టైలిష్ స్కూటర్ ను తీసుకొస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఎడ్డీ(Eddy)గా పిలిచే ఈ ఈ-స్కూటర్ లో.. ఫైండ్ మై బైక్, ఈ-లాక్, ఫాలో మీ హెడ్ లాంప్, రివర్స్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. సుమారు రూ.72,000గా ధరతో రానున్న ఈ ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను నడిపేందుకు లైసెన్సు, రిజిస్ట్రేషన్ అవసరం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Post a Comment

0 Comments