Header Ads Widget

గిన్నీస్ రికార్డు సాధించిన 'ది అమెరికన్ డ్రీమ్'


ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన, పొడవైన కారుగా రికార్డు సృష్టించింది అమెరికాలోని 'ది అమెరికన్ డ్రీమ్' వెహికల్. ఈ వాహనం ప్రస్తుతం అదనపు హంగులతో చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. స్విమ్మింగ్‌ పూల్‌, హెలిప్యాడ్‌ వంటి సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ వెహికల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా పేరు పొందింది. ఇప్పుడు ఇది కొత్త హంగులతో ముస్తాబైంది. ఇటీవలే ఈ కారు 30.54 మీటర్ల (100 అడుగుల 1.5 అంగుళాలు) పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకొంది. కారుకు సంబంధించిన ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన వెబ్‌సైట్‌, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు అందరినీ అమితంగా ఆకట్టుకొంటున్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఈ కారును ముందు 1986లో కాలిఫోర్నియాలోని బర్బ్ యాంక్‌కి చెందిన కస్టమైజర్ జే ఓర్‌బర్గ్ తయారు చేశారు. అప్పట్లో ఈ కారు 60 అడుగుల పొడవు, 26 చక్రాలతో ఉండేది. ముందు, వెనుక భాగంలో ఒక జత V8 ఇంజిన్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఈ కారుకు ప్రస్తుతం కొన్ని అదనపు హంగులు జోడించారు. దీంతో ఇప్పుడు దీని పొడవు 30.5 మీటర్లకు పెరిగింది. ఈ కారు సుమారు ఆరు హోండా సిటీ సెడాన్‌ల పొడవు ఉంటుంది. "ది అమెరికన్ డ్రీమ్" 1976 కాడిలాక్ ఎల్డోరాడో లిమోసిన్‌ తరహాలో ఉంటుంది. రెండు చివరల నుంచి నడపవచ్చు. ఇందుకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు కూడా లభించింది. రెండు విభాగాలుగా దీన్ని రూపొందించారు. మధ్యలో కీలు లాంటి భాగంతో జోడించి.. మూలల్లో సక్రమంగా తిరిగేలా ఏర్పాటు చేశారు. ది అమెరికన్ డ్రీమ్ పునరుద్ధరణలో పాల్గొన్న మైఖేల్ మానింగ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ నిర్వాహకులతో మాట్లాడుతూ.. 'పొడవైన, భారీ పరిమాణం కూడా కారుకు అత్యంత లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. కారులో పెద్ద వాటర్‌బెడ్, డైవింగ్ బోర్డ్‌తో కూడిన స్విమ్మింగ్ పూల్, జాకుజీ, బాత్‌టబ్, మినీ-గోల్ఫ్ కోర్స్, హెలిప్యాడ్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. హెలిప్యాడ్‌ను కారుకు ఉక్కు బ్రాకెట్లతో అమర్చారు. ఐదు వేల పౌండ్ల వరకు బరువును ది అమెరికన్‌ డ్రీమ్ భరించగలదు.' అని చెప్పారు. ఈ పొడవైన కారులో రిఫ్రిజిరేటర్లు, టెలిఫోన్లు, అనేక టీవీ సెట్లు అందుబాటులో ఉన్నాయి. కారులో ఒకేసారి 75 మంది కంటే ఎక్కువ మంది కూర్చోవచ్చు. కారు తయారైన కొత్తలో దీన్ని చాలా సినిమాల్లో చూపించారు. చాలా మంది అద్దెకు కూడా తీసుకొన్నారు. అయినప్పటికీ దాని నిర్వహణ ఖర్చు, పార్కింగ్ సమస్యల కారణంగా ప్రజలు ఆసక్తిని కోల్పోయారు. మ్యానింగ్ eBayలో కొనుగోలు చేసిన తర్వాత కారును పునరుద్ధరించే ప్రాజెక్ట్‌ మొదలైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకుల వివరాల ప్రకారం.. రీ మోడల్ పనికి షిప్పింగ్, మెటీరియల్స్ , లేబర్ ఖర్చు 250,000 డాల్లర్లు అయింది. పని మొత్తం పూర్తి చేయడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. అయితే ఆశ్చర్యకరంగా కారు రోడ్డుపైకి రావడం లేదు. డెజర్లాండ్ పార్క్ కార్ మ్యూజియం ప్రత్యేకమైన క్లాసిక్ కార్ల సేకరణ విభాగంలోనే ఉందని ప్రతినిధులు వివరించారు.

Post a Comment

0 Comments