Ad Code

యూకే కంపెనీకి చంద్రుడిపై ఆక్సిజన్ తయారీ అవకాశం!


చందమామపై మనుషులు నివసించేలా చేయాలని చాలా కాలంగా పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఆక్సిజన్ తయారు చేయాలని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఈ అవకాశం కోసం పలు కంపెనీలు పోటీ పడ్డాయి. తాజాగా ఈ అవకాశం యూకేకు చెందిన థేల్స్ అలీనియా స్పేస్ కంపెనీ నేతృత్వంలోని బృందానికి దక్కినట్లు ఈఎస్ఏ వెల్లడించింది. చంద్రుడిపై ఆక్సిజన్ తయారు చేసే ఒక ప్రోటోటైప్ మెషీన్ తయారు చేసే పనిని ఈ బృందానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ యంత్రం సోలార్ ఎనర్జీతో నడిచేలా రూపొందించనున్నారు. దీని ద్వారా ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను చంద్రుడిపై ప్రొపెల్లెంట్‌లా, అలాగే వ్యోమగాములు ఊపిరి తీసుకునేందుకు ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. చంద్రుడి నేల నుంచి కనీసం 50 నుంచి 100 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం ఈ యంత్రం లక్ష్యంగా నిర్దేశించారు. ఈఎస్ఏ ఇచ్చిన శాంపిల్ నుంచి 70 శాతం ఆక్సిజన్‌ను ఈ యంత్రం బయటకు తీయాల్సి ఉంటుందట!. ఈ ప్రక్రియ మొత్తం పదిరోజుల్లోనే పూర్తవ్వాలని కూడా ఈఎస్ఏ షరతు విధించింది. ఎందుకంటే చంద్రుడిపై పదిరోజులే సూర్యుడు కనిపిస్తాడు. ఆ తర్వాత అత్యంత చీకటి, చలిగా ఉండే రాత్రి మొదలవుతుంది. వివిధ లూనార్ ల్యాండర్స్‌లో ప్రయాణించే విధంగా తక్కువ శక్తిని వినియోగించుకునేదిగా ఉండాలని ఈఎస్ఏ తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu