Ad Code

ట్విట్టర్ చైర్మన్‌గా జాక్ డోర్సీ ?


మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో కో-ఫౌండర్, మాజీ సీఈవో జాక్ డోర్సీ కీలక బాధ్యతలు వహించబోతున్నారా? ఐదు నెలల క్రితం సీఈవోగా వైదొలిగిన డోర్సీ తిరిగి ఆ బాధ్యతలు చేపట్టబోతున్నారా అనే వార్తలొస్తున్నాయి. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న ఎలన్‌మస్క్‌కు, జాక్ డోర్సీకి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయి. ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకుంటానని తొలుత ప్రకటించినప్పుడు ప్రస్తుత ఆ సంస్థ యాజమాన్యంపై తనకు విశ్వాసం లేదని మస్క్ చెప్పారు. దీంతో ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ స్థానం సురక్షితం కాదనే అభిప్రాయం వినిపిస్తున్నది. అదే జరిగి, సీఈవోగా పరాగ్ అగర్వాల్ వైదొలిగితే.. ఆ స్థానంలో నూతన సీఈవోగా ఎవరిని నియమిస్తారన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానం చెప్పగలిగింది ఒక్క ఎలన్‌మస్క్ మాత్రమే. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ తిరిగి తన బాధ్యతల్లోకి వచ్చేస్తారన్న వార్తలను కొట్టి పారేయలేం. ట్విట్టర్ ఇండియా మాజీ అధిపతి మనీశ్ మహేశ్వరి సైతం ఇటీవల స్పందిస్తూ జాక్ డోర్సీ సంస్థలో మరింత శక్తిమంతమైన పాత్ర పోషించబోతున్నారని, ట్విట్టర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. ఐదు నెలల క్రితం సీఈవోగా వైదొలిగిన జాక్ డోర్సీ మళ్లీ ఆ పోస్ట్ చేపడతారని చైనా అనలిస్ట్‌లు చెబుతున్నారు. ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ దశాబ్ద కాలానికి పైగా ట్విట్టర్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఎల్లియట్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సీఈవోగా జాక్ డోర్సీ రాజీనామా చేశారు. దీంతో అప్పటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను సీఈవోగా ప్రమోట్ చేశారు. జాక్ డోర్సీ, ఎలన్‌మస్క్ మధ్య స్నేహపూరిత అనుబంధం ఉంది. ట్విట్టర్‌ను టేకోవర్ చేయాలన్న ఎలన్‌మస్క్ ప్రతిపాదనకు జాక్ డోర్సీ మద్దతు ఇచ్చిన కారణాల్లో ఇదొకటి. 44 బిలియన్ డాలర్ల ఎలన్‌మస్క్ ఆఫర్‌ను ట్విట్టర్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించగానే జాక్‌డోర్సీ ట్వీట్ల వర్షం కురిపించారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ను టెస్లా సీఈవో మస్క్ నడుపగలరని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చాలన్న మస్క్ ప్లాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ట్విట్ చేశారు. వాల్ స్ట్రీట్ నుంచి వెనక్కు తీసుకోవడం సరైన మొదటి చర్య అని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో జాక్ డోర్సీకి 2.36 శాతం వాటాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu