Ad Code

భద్రత లోపిస్తే భారీ మూల్యం తప్పదు..!


ఈవీ వాహనాల తయారీలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు హెచ్చరించారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గడ్కరీ హెచ్చరించారు. నాణ్యత లోపించిన ఈవీ వాహనాల తయారీ కంపెనీలకు భారీ జరిమానా విధించాల్సి వస్తుందని గడ్కరీ తెలిపారు. నాణ్యత లోపించిన ఈవీ వాహనాలను వెంటనే రీకాల్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈవీ వాహనదారుల భద్రతకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూకట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు గడ్కరీ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. వాహనదారులను ఈవీ వాహనాలపై మొగ్గు చూపేలా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రాయితీలను ప్రకటిస్తోంది. దాంతో ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ వాహనాల కొనుగోళ్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈవీ వాహనాల్లో మంటలు రావడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. నిజామాబాద్‌లో ఈవీ వాహనం బ్యాటరీ పేలడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలపై మంత్రి గడ్కరీ స్పందించారు. గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 'ఈవీ పేలుడు' ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడినట్లు మంత్రి గడ్కరీ తెలిపారు. ఈవీ వాహనాల ఘటనలపై నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. వచ్చిన సిఫార్సుల ఆధారంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. ఈవీ వాహనాల తయారీ విషయంలో కంపెనీలు నాణ్యత లోపించిన వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తే.. భారీ జరిమానాలు విధిస్తామని గడ్కరీ హెచ్చరించారు. వినియోగదారుల భద్రత దృష్ట్యా ఈవీ వాహన తయారీ దారులు అవసరమైన చర్యలను చేపట్టాలని గడ్కరీ సూచనలు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu