త్వరలోనే నథింగ్ ఫోన్ (1) విడుదల ?


టెక్ స్టార్టప్ నథింగ్ కంపెనీ నుంచి తొలి ఫోన్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఈ ఫోన్‌పై ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నథింగ్ ఫోన్ (1) పేరుతో ఈ మొబైల్ వినియోగదారులను పలకరించనుంది. కంపెనీ తన మొదటి స్మార్ట్‌ఫోన్ 2022 సమ్మర్‌లో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, నథింగ్ ఫోన్ (1) కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఫోన్ (1) లాంచ్‌కు ముందు మెయిన్ ఫీచర్లను కూడా వెల్లడించలేదు. నథింగ్ ఫౌండర్ కార్ల్ పీ ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక చిన్న ఈవెంట్ సందర్భంగా ఫోన్ (1) 2022 సమ్మర్‌లో లాంచ్ అవుతుందని వెల్లడించారు. ఆ సమయంలో కార్ల్ పీ ఏ నెలలో లాంచ్ చేస్తున్నామనేది మాత్రం ప్రకటించలేదు. అయితే నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను జైన్, జూలై - ఆగస్టు మధ్య ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుందని తెలిపారు. నథింగ్ ఫోన్ (1) ఇప్పటికే ఇండియాలో టెస్టింగ్ దశలో ఉందని ఓ టిప్‌స్టర్ వెల్లడించారు. దీంతో నథింగ్ ఫోన్ (1) త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఇంకా, ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)లో కూడా ఈ ఫోన్ కనిపించింది. నథింగ్ ఫోన్ (1) మోడల్ నంబర్ A063ని కలిగి ఉందని లిస్ట్ వెల్లడిస్తుంది. స్పెసిఫికేషన్‌ల గురించి నథింగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉపయోగిస్తుందని విశ్వసనీయ సమాచారం. నథింగ్ ఫోన్ (1)లో కచ్చితంగా ఏ ప్రాసెసర్ వాడారనేది తెలియాల్సి ఉంది. నథింగ్ ఫోన్ (1) ఆండ్రాయిడ్ 12-ఆధారిత నథింగ్ ఓఎస్‌తో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్త ఓఎస్ స్కిన్ క్లీన్ & మినిమల్ లుక్, ఫ్లూయిడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుందని కంపెనీ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి ఫోన్ (1) అందుబాటులో ఉంటుందని నథింగ్ నిర్ధారించింది. ఈ విషయాలను తప్ప కంపెనీ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. లీక్ ప్రకారం ఫోన్ (1) స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 50ఎంపీ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్+ 256జీబీ వరకు స్టోరేజ్ తో వచ్చే ఈ ఫోన్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఆఫర్ చేస్తుందని టాక్. లీకైన ఈ వివరాలు నిజం కాకపోవచ్చు కాబట్టి అధికారికంగా నథింగ్ కంపెనీ స్పెసిఫికేషన్లను ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Post a Comment

0 Comments