2030 నాటికి 6జీ పరిజ్ఞనం ?
Your Responsive Ads code (Google Ads)

2030 నాటికి 6జీ పరిజ్ఞనం ?


కొత్తపుంతలు తొక్కుతోన్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రజలు ఉవ్విళూరుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా మారిపోతున్న సాంకేతికతతో మొబైల్ ఫోన్స్, నెట్‌వర్క్ పరిజ్ఞానం ముందంజలో ఉంది. ప్రస్తుతం 4జీగా ఉన్న సెల్‌ఫోన్ నెట్‌వర్క్ మరో ఏడాదిలోగానే పూర్తి స్థాయిలో 5జీగా మారనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎన్‌హన్సడ్ 5జీ నెట్ వర్క్ అందుబాటులో ఉంది. 5జీ సాంకేతికత అందుబాటులోకి రావడంతోనే ఇంటర్నెట్ వస్తుసేవల్లోనూ పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. 5జీ సాంకేతికతకు తగ్గట్టుగా స్మార్ట్‌ఫోన్స్ కూడా సాంకేతికత పరంగా మారిపోతున్నాయి. అయితే రానున్న రోజుల్లో 5జీని అధిగమించి 6జీ సాంకేతికత వైపుకు పరుగులు తీయనుంది ప్రపంచం. అందుకు సంబంధించి మొదటి అడుగు కూడా ఇప్పటికే పడింది. ఒక్కసారి 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మనం చూస్తున్న, వాడుకలో ఉన్న స్మార్ట్‌ఫోన్ కూడా మాయం అవుతుందని ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా సంస్థ సీఈఓ పెక్క లుండ్‌మార్క్ అంటున్నారు. 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తే సాంకేతికతను మనం చూసే దృక్కోణం కూడా మారుతుందని పెక్క అంటున్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్యానెల్ సభ్యుడిగా పాల్గొన్న ఆయన 6జీ సాంకేతికత గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 2030 ఆరంభం నాటికే ప్రపంచ వ్యాప్తంగా 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని..అప్పటికి ఈ స్మార్ట్‌ఫోన్స్, ఇతర హార్డువేర్ పరికరాలు మాయం అయి వాటి స్థానంలో స్మార్ట్‌గ్లాసెస్, శరీరం – మెదడుతో నియంత్రించగలిగే కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తాయని పెక్క వివరించారు. ఆయా పరికరాల తీరుతెన్నులు ఎలా ఉంటాయన్న సంగతి తనకూ అవగాహన లేదన్న పెక్క లుండ్‌మార్క్..టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల అభివృద్ధి చేసిన ‘న్యూరాలింక్’ సాంకేతికతను ఉదహరించారు. మానవ శరీరంలోని నాడుల స్పందన ఆధారంగా పనిచేసే న్యూరాలింక్ వంటి పరిజ్ఞానం అతి త్వరలోనే అందుబాటులోకి రానుందని, 6జీ సాంకేతికత ఉంటేనే అటువంటి పరికరాలు వేగంగా పనిచేయగలవాని పెక్క పేర్కొన్నారు. కాగా భారత్‌లోనూ మరికొన్ని నెలల్లోనే 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. 2024 నాటికే భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 6జీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర సమాచారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం..రానున్న పదేళ్లలో భారత్‌లో 6జీ పరిజ్ఞాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog