Ad Code

స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ ధరలు పెరగబోతున్నాయి ?


గత ఏడాదిగా సెమీకండక్టర్, చిప్ కొరత కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఆ ధరల పెరుగుదల ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. విడిభాగాల ధరలు పెరగడం, డిమాండ్, సప్లై కొరత ఏర్పడటం కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఇంకా పెరగబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. చైనాలో లాక్‌డౌన్‌ల కారణంగా ముడిసరుకు ధరలు పెరగడం, రవాణా ఆలస్యం కారణంగా ధరల పెంపు వైపు మొగ్గు చూపాల్సి వస్తోందని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు చెబుతున్నారు. భారతదేశంలో కన్స్యూమర్ గూడ్స్ ధరలు 5 నుంచి 7 శాతం వరకు పెరగొచ్చని అంచనా. భారత్ లోనే కాక, చైనాలో కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ విడిభాగాల కొరత ఎదుర్కొంటూనే ఉంది. ప్రస్తుత షిప్‌మెంట్లలో నాలుగైదు వారాల జాప్యం కొనసాగితే, సమీప భవిష్యత్తులో భారతదేశంలో భయంకరమైన పరిస్థితి చూస్తామని సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్  సీఈఓ అవ్నీత్ సింగ్ మార్వా తెలిపారు. విడి భాగాల కొరత ధరల్లో పెద్ద అస్థిరతకు కారణమైందని, ఒక కంపెనీగా, తాము ధరలను 5-7 శాతం పెంచాల్సి ఉంటుందని అవ్నీత్ సింగ్ మార్వా అన్నారు. అదే జరిగితే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఏసీలు, ఇంపోర్టెడ్ వాచీల ధరలు పెరగడం ఖాయం. కన్స్యూమర్ గూడ్స్ ధరలు 10 శాతం వరకు పెరగొచ్చని అంచనా.  కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, పరిశ్రమ సప్లై చెయిన్ సమస్యలను ఎదుర్కొంటోందని ఇండ్‌కల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ ఆనంద్ దూబే తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమస్యను మరింత తీవ్రతరం చేసిందని, ఈ దేశాలు చిప్‌ల తయారీలో ఉపయోగించే కీలకమైన ఖనిజాల ఉత్పత్తిదారులలో రెండు అతిపెద్ద దేశాలని అన్నారు. వాస్తవానికి, సుదీర్ఘమైన యుద్ధం మరింత బాధ, సంక్లిష్టతలకు దారి తీస్తుందని, ధరలపై ప్రభావం పడకుండా తాము అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నా, ప్రస్తుత ధరల్ని కొనసాగించడం ఓ సవాలుగా మారిందని ఆనంద్ దూబే వివరించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎలక్ట్రానిక్స్ రంగం ఇప్పటికే ప్రతీ త్రైమాసికంలో 2-3 శాతం ధరలను పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సప్లై చెయిన్‌లో సమస్యల కారణంగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు కూడా నిత్యావసర వస్తువుల ధరల్ని పెంచాల్సి వచ్చింది. 

Post a Comment

0 Comments

Close Menu