Ad Code

నెట్‌ఫ్లిక్స్ దిద్దుబాటు చర్యలు !


నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇటీవల యూజర్లను ఎక్కువగా కోల్పోతున్న నెట్‌ఫ్లిక్స్ దీనికి తగ్గట్లు దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఒకవైపు ఉన్న యూజర్లను కాపాడుకుంటూనే... కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను తీసుకురానుంది. సాధారణ ప్లాన్‌ల కంటే వీటి సబ్‌స్క్రిప్షన్ ధర మరింత తక్కువగా ఉండనుంది. అయితే ఈ తక్కువ ధర ప్లాన్స్‌లో వినియోగదారులు యాడ్స్‌ను భరించాల్సి ఉంటుంది. ఈ యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌లను నెట్‌ఫ్లిక్స్ తీసుకురానుందని గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అధికారికంగా ప్రకటించారు. కేన్స్ లయన్స్ అడ్వర్టైజింగ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండోస్ ఒక ఇంటర్వ్యూలో నెట్‌ఫ్లిక్స్ వ్యూహాల గురించి మాట్లాడారు. యాడ్ సపోర్టెడ్ ప్లాన్స్ ఎందుకు తీసుకురావాలి, దానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. తాము చాలా పెద్ద వినియోగదారుల విభాగాన్ని విస్మరించామని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఖరీదు ఎక్కువగా ఉందని, అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నా ఇబ్బంది లేదనుకునే వినియోగదారులను ఇంతకాలం పట్టించుకోలేదన్నారు. అందుకే యాడ్స్ కూడా ఉన్న కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లకు యాడ్స్ తీసుకురావడం లేదని, కేవలం కొత్తగా వచ్చే తక్కువ ధర ప్లాన్‌లకు మాత్రమే యాడ్స్ ఉంటాయనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రెండు లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో కంపెనీ ఆదాయం భారీగా పడిపోవడంతో పాటు విలువ కూడా తగ్గింది. దీంతో కాస్ట్ కటింగ్ కోసం ఆరునెలల్లోనే 600 మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేందుకు ఏం చేయాలనే ఆలోచల నుంచే ఈ యాడ్ సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ పుట్టాయి. ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యాడ్ సపోర్టెడ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలను తీసుకువస్తున్నాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ బాటలోనే నడవనుంది.

Post a Comment

0 Comments

Close Menu