Ad Code

వరల్డ్ ఎమోజీ డే !


ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్, డెస్క్‌టాప్.. ఎక్కడైనా సరే ఎమోజీలు వాడని వారుండరు. వాట్సాప్ నుంచి సోషల్ మీడియా యాప్స్ వరకు ఎమోజీలు వాడాల్సిందే. ఒక్క ఎమోజీతో మనసులోని భావాల్ని క్షణాల్లో, సులభంగా చెప్పేయొచ్చు. అందుకే ఎమోజీలంటే యూజర్లకు అంత క్రేజ్. జూలై 17 వరల్డ్ ఎమోజీ డే. ఈ నేపథ్యంలో త్వరలో కొత్త ఎమోజీలు రాబోతున్నట్లు ప్రకటించింది యునికోడ్ కన్సార్టియం. ఈ సంస్థే ఎమోజీలను రూపొందిస్తుంటుంది. ఎమోజీ 15.0 అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా 31 ఎమోజీలు రాబోతున్నట్లు ఎమోజీపీడియా వెల్లడించింది. హై ఫైవ్, షేకింగ్ హెడ్, బ్లూ, గ్రే, పింక్ కలర్స్‌లో ఉండే హార్ట్, బాతు, జెల్లీ ఫిష్, బఠాని కాయ, అల్లం, మరకాస్ సంగీత వాయిద్యం వంటి 31 ఎమోజీలు రాబోతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఎమోజీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,633 ఎమోజీలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎమోజీలను తయారు చేసే యునికోడ్ కన్సార్టియం సంస్థ ఐఫోన్, ఆండ్రాయిడ్ డెవలపర్స్ అయిన యాపిల్, గూగుల్ సంస్థలకు వీటిని పంపుతుంది. ఈ ఎమోజీల్ని పరిశీలించిన అనంతరం ఆ కంపెనీలు తమ సూచనలు చేస్తాయి. వాటికి తగ్గట్లుగా మార్పులు చేసి, కొత్త ఎమోజీలను విడుదల చేస్తారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూపొందిస్తున్న ఎమోజీల సంఖ్య చాలా తక్కువ. గత సంవత్సరం 112 ఎమోజీల్ని రూపొందించగా, ఈ సారి మాత్రం 31కే పరిమితం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu