Ad Code

ఒక్క టమాటా రెండు కోడిగుడ్లతో సమానం !


శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. రోగనిరోధక వ్యవస్థ బలంగా పనిచేయటంలో విటమిన్‌ 'డీ' కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికీ, కండరాల కణాల అభివృద్ధికి దోహదపడుతుంది. విటమిన్‌ 'డీ' వల్ల మెదడు సక్రమంగా పని చేస్తుంది. విటమిన్‌ డి నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటినీ పోగొడుతుంది. శరీరానికి కావాల్సిన 'డి' విటమిన్‌ ఎండ నుంచే వస్తుంది. మనం ఎండలో నిలబడినప్పుడు సూర్యరశ్మిని గ్రహించి శరీరంలో విటమిన్‌ 'డీ' తయారవుతుంది. చర్మానికి ఎండ తగిలినపుడు కొలెస్ట్రాల్‌ నుంచి విటమిన్‌ 'డీ' ని మన శరీరమే తయారుచేసుకుంటుంది. కానీ ఈ ఉరుకుల పరుగుల బిజీ లైఫ్‌లో ఎండలో నిలబడేందుకు సమయం లేకపోవడం సహా ఎన్నో కారణాలు ఇబ్బందిగా ఉంటున్నాయి. అయితే ఈ విటమిన్ కొంతమొత్తంలో ఆహారంలోనూ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఆహారం ద్వారా సమృద్ధిగా విటమిన్‌ 'డీ' అందించడంపై ఇంగ్లాండ్ కు చెందిన జాన్ ఇన్నెస్ సెంటర్ వృక్ష శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. టమాటాల్లో గణనీయంగా విటమిన్‌ 'డీ' ఉత్పత్తి అయ్యేలా సరికొత్త పరిశోధన చేపట్టారు. టమాటాల్లో క్రిస్పర్ టెక్నాలజీతో జన్యుమార్పిడి చేసి.. వాటిల్లో సమృద్ధిగా విటమిన్‌ 'డీ' తయారయ్యేలా చేయగలిగారు. ఈ జన్యుమార్పులు చేసిన టమాటా ఒక్కోదాంట్లో రెండు కోడిగుడ్లలో ఉండేటంత విటమిన్‌ 'డీ' ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టమాటాలను ఎండపెట్టడం ద్వారా దీని పరిమాణం మరింతగా పెరుగుతుందని అంటున్నారు. జంతువులు, మొక్కలు సహా జీవులేవైనా వాటిలో జన్యు పదార్థం ఉంటుంది. అందులో వేలకొద్దీ జన్యువులు ఉంటాయి. అవే ఆయా జీవుల రూపం, లక్షణాలను నిర్దేశిస్తాయి. అలాంటి జన్యువుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుకల్పించే సాంకేతికతను 'క్రిస్పర్ టెక్నాలజీ' అంటారు.

Post a Comment

0 Comments

Close Menu