Header Ads Widget

కృత్రిమ మేధ ప్రమాదకరంగా మారవచ్చు !


కృత్రిమ మేధ (ఏఐ)తో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ ఏఐ వల్ల మానవాళి తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదమూ ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అటువంటి వారి వాదనకు బలం చేకూర్చేలా గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిత్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధను ఆయన అణ్వాయుధాలతో పోల్చడం గమనార్హం. నైతిక విలువల ఆధారంగానే కృత్రిమ మేధ (ఏఐ) పని చేయాలని, అందుకు తగ్గ నిబంధనలు, మార్గదర్శకాలు తీసుకురావాలని ఆయన చెప్పారు. లేదంటే ఐఏ ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించారు. ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరం తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను గూగుల్ సీఈవోగా ఉన్నసమయంలో (2001 నుంచి 2011 వరకు) ఉన్న పరిస్థితులు, 20 ఏళ్ళుగా చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు. గూగుల్ సంస్థ ప్రారంభమైన సమయంలో సమాచార శక్తి గురించి తనకు అంతగా తెలియదని చెప్పారు. కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగం అంశాల్లో నైతిక విలువల ఆధారంగానే పని చేయాలని, అమెరికా, చైనా మధ్య ఈ విషయంలో ఒప్పందం జరగాలని ఆయన అన్నారు. 1950, 1960 దశకాల్లో క్రమంగా సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం జరిగిందని అన్నారు. ఇప్పుడు కృత్రిమ మేధ కూడా చాలా శక్తిమంతంగా తయారవుతుందని చెప్పారు. కృత్రిమ మేధను ఎలా వాడాలి? ఎలా అభివృద్ధి చేయాలన్న విషయాలను నిర్దేశించేందుకు ఏ వ్యవస్థా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీరు ఏఐను దుర్వినియోగం చేసేందుకు, ప్రమాదకర రీతిలో వాడేందుకు దారి తీస్తుందని అన్నారు.

Post a Comment

0 Comments