Header Ads Widget

టాప్ బిడ్డర్‌గా జియో !


5జీ స్పెక్ట్రమ్ వేలంతో.. ప్రభుత్వంపై కాసుల వర్షం కురిసింది. వారం రోజులు జరిగిన వేలంలో లక్షన్నర కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. వేలంలో రిలియన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. 4జీ డేటా విప్లవం తీసుకువచ్చి.. జీవితాలకు వేగం నేర్పించిన జియో.. ఇప్పుడు 5జీతో ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతోంది.. 5జీతో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకునే అవకాశం ఉంది. చప్పట్ల నుంచి చాటింగ్‌ వరకు మనుషుల మధ్య కమ్యూనికేషన్‌ పెరిగింది. గత పదేళ్లలో గొప్ప టర్న్‌ తీసుకుంది. నాలుగో తరానికి వేదిక అయిన గత దశాబ్దం.. కొత్త విప్లవానికి పునాదులు వేసింది. డేటా రంగంలో రిలయన్స్ జియో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు అన్నీ ఇన్నీ కావు. డేటా అంటే కొందరే వినియోగిస్తారని.. అది భరించే శక్తి కొన్ని వర్గాలకు మాత్రమే ఉంటుందన్న అనుమానాల పటాపంచలు చేస్తూ.. హద్దులు చెరిపేసింది జియో. దేశంలో 2008లో 3జీ మొదలైనా.. 2016లో రిలయన్స్ జియో మొదలైన తర్వాత మొబైల్ సేవల్లో వేగం పుంజుకుంది. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. 4జీ డేటా స్పీడ్‌తో.. జీవితాలకు పరుగులు నేర్పింది జియో. అలాంటి సంస్థ చేతికి ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్‌ అందింది. దీంతో మరో డిజిటల్ విప్లవం ఖాయం అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. జియో తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్-ఐడియా ఉన్నాయ్. 4జీ స్పెక్ట్రమ్ 77వేల 815కోట్లకు అమ్ముడుపోగా… 5జీకి దాదాపు రెట్టింపు మొత్తం వచ్చింది. ఈ వేలం నుంచి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. మొత్తంగా లక్షన్నర కోట్లకు పైగా బిడ్స్‌ దాఖలయ్ాయ్. వేలానికి తీసుకొచ్చిన స్పెక్ట్రమ్‌లో.. 71 శాతం అమ్ముడుపోయింది. దేశమంతా 5జీ సేవలను అందించేందుకు ప్రస్తుతం అమ్ముడుపోయిన స్పెక్ట్రమ్ చాలు ! 88వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి… జియో సంస్థ 5జీ స్పెక్ట్రమ్ బిడ్స్‌ను కొనుగోలు చేసింది. 5జీ సేవలకు అత్యంత కీలకమైన 700 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌ను 22సర్కిల్స్‌లో దక్కించుకుంది జియో. యూరప్‌, అమెరికాలో 5జీ సేవలకు ఈ బ్యాండ్‌నే వాడుతున్నారు. ప్రీమియం బ్యాండ్‌గా భావించే 700 మెగాహెడ్జ్ బ్యాండ్ దక్కించుకోవడంతో.. జియో దూకుడుకు అడ్డు ఉండకపోవచ్చు. 4జీతో జియో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. గిరిజన గ్రామాల్లోనూ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు, 4జీ సేవలు కనిపిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరి జీవితంలో డేటా భాగం అయింది.. జియో భాగం అయింది.. కాల్‌ చార్జీలకు సపరేట్‌గా, ఇంటర్నెట్‌కు సపరేట్‌గా రీఛార్జ్‌ చేసుకోవాల్సిన పరిస్థితికి జియో బ్రేక్ వేసింది. ఎన్ని కాల్స్ చేసుకున్నా రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా చేసేసింది. పైగా హైక్వాలిటీ డాటాను … అదీ అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా లెక్కలు తీస్తే.. ఇండియన్ మొబైల్ యూజర్స్ నెలకు 11.2 జిబీ డాటాను వాడేస్తున్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతగా వాడడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలనుకున్న అమెరికాలో నెలకు ఒక్కో మొబల్‌ యూజర్ వాడేది 5 జీబీ మాత్రమే.. మన తర్వాత స్థానంలో ఉన్న బ్రిటన్‌లో వాడేది 9 జీబీ మాత్రమే. ఇక ధరల విషయంలోనూ మన దగ్గరే చాలా చీప్‌. ఒక్కో జీబీకి కేవలం 7 రూపాయలు మాత్రమే ఖర్చవుతోంది. గ్రామాల్లోనూ హైక్వాలిటీ 4G సేవలు అందుతుండడంతో ఓటీటీ యాప్స్‌కూ సబ్‌స్రైబర్స్ పెరుగుతున్నారు. నచ్చినప్పుడు నచ్చిన సినిమానో, వెబ్‌ సిరీసో చూసుకుంటున్నారు. ఇంతగా డాటా అందుబాటులోకి వస్తుందని పదేళ్ల క్రితం ఒక్కరు కూడా ఊహించలేదు. అసలు ఇండియాలాంటి దేశంలో ఇంతగా డిజిటల్‌ విప్లవం వస్తుందనీ నమ్మలేదు. కానీ.. జియో రాకతో అన్నీ మారిపోయాయి. ఇతర టెలికాం కంపెనీలు కూడా ప్లాన్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోటీని తట్టుకోలేక కొన్ని కంపెనీలు మూసుకోవాల్సి వచ్చినా.. అంతిమంగా మొబైల్‌ యూజర్‌కు మాత్రం చాలా మేలే జరిగింది. ఇప్పుడు 5జీ వేలంలో జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. ఇక మార్పు ఎలా ఉంటుందో.. ఎలాంటి అనుభూతులు పరిచయం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాబోతోన్న 5జీ దృష్టిలో పెట్టుకొని.. ముందు నుంచే జియో ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే 5జీ మొబైల్‌ను అతి తక్కువ ధరకు అందిస్తున్న సంస్థ.. మొబైల్‌ ఆధారిత సేవలపై మరింత దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. జియోకు ఇప్పటికే దాదాపు 41 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరందరికీ 5జీ సేవలు అందించడంతో పాటు కొత్తగా కస్టమర్లను సంపాదించడంపై దృష్టి పెట్టింది జియో. ఆగస్టు 15 నుంచే సేవలు అందించడానికి సిద్ధమవుతోంది. జియో రాకతోనే ఓటీటీ యాప్స్‌ ఊపందుకున్నాయ్. అలాంటి ఓటీటీలపై జియో ఇప్పుడు దృష్టిసారించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు వూట్‌ యాప్‌తో పాటు.. జియో సినిమా, జియో సావన్‌, జియో మార్ట్‌, ఏ జియో.. ఇలా రకరకాల యాప్స్ ఉన్నాయ్. 5జీ ఓటీటీ బిజినెస్ ఊపందుకునే అవకాశం ఉంది. దానిపై ప్రధానంగా జియో దృష్టి సారించే చాన్స్ కనిపిస్తోంది.

Post a Comment

0 Comments